తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతూ పెడన 12వ వార్డు మాజీ కౌన్సిలర్, వైసీపీ నాయకుడు దొడ్డిపట్ల నాగేశ్వరరావు సోమవారం జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు. పెడన అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేష్ వర్గానికి చెందిన మనుషులతో తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు జోగి రమేష్ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.10 లక్షలతో తన వద్దకు వచ్చి వైసీపీ తరఫున 12వ వార్డులో ఓట్లు కొనుగోలు చేయాలని ప్రతిపాదించగా తాను తిరస్కరించానని పేర్కొన్నారు. ఆ ఇద్దరూ వార్డులో ఓటరుకు వెయ్యి రూపాయల చొప్పున బాహాటంగా పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేశారని ఆరోపించారు.
ఓట్ల కొనుగోలుతో తనకు సంబంధం లేకపోయినా ఆరేపల్లి రాము, భళ్ల గంగయ్య, కూనపురెడ్డి రంగా, తిప్పా పాండు తదితరులు తనను జోగి రమేష్ కార్యాలయానికి తీసుకె ళ్లి 10 లక్షల రూపాయలకు లెక్కలు చెప్పాలంటూ వత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఇదే వ్యక్తులు గత నెల 19న తనను కిడ్నాప్ చేసి బుద్దాలపాలెం గ్రామంలోని చేపల చెరువుల వద్దకు తీసుకెళ్లి వార్డులో 10 లక్షలకు గాను 6 లక్షలు మాత్రమే పంపిణీ జరిగినందున మిగిలిన నాలుగు లక్షలు ఇవ్వాలని, ఇవ్వకపోతే చంపేస్తామంటూ తనపై చేయి చేసుకున్నారని, కత్తులు చూపించి బెదిరించారని ఆరోపించారు. ఆరేపల్లి రాము, భళ్ల గంగయ్య, కూనపురెడ్డి రంగా, తిప్పా పాండుతో పాటు మరో ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులపై చర్యలు తీసుకుని తనకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు.