ఈ నెల 10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎం కార్యాలయం సీఎస్‌కు పంపిన నోట్ ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సీఎం కార్యాలయం పంపిన నోట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌తో సీఎస్ సమావేశమయ్యారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. కేబినెట్ సమావేశం నిర్వహించాలంటే సీఎం కార్యాలయం సీఎస్‌కు నోట్ పంపిస్తుంది. ఆ నోట్‌ను సీఎస్... ఇతర విభాగాల కార్యదర్శులకు పంపిస్తారు. కార్యదర్శులు పంపే సమాచారం ఆధారంగా అజెండా రూపొందిస్తారు.
ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి సమస్య, తుపాను సహాయక చర్యలు, కరవు పరిస్థితులపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై సీఎస్ సుబ్రమణ్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ సమావేశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశముంది. సీఈసీ ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఫణి తుపాను ప్రభావం, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, తాగునీటి ఎద్దడిపై సమావేశంలో చర్చ జరగనున్నది. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఎలా రియాక్ట్ అవుతారా..? అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కేబినెట్ భేటీ ఎజెండాకే పరిమితమవుతుందా? లేదా బిజినెస్ రూల్స్‌పై కూడా చర్చిస్తారా..? అని ఉత్కంఠ నెలకొంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారమే వ్యవహరించాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే సమీక్షా సమావేశాలకు అటు సీఈవో.. ఇటు సీఎస్ ఇద్దరూ అంగీకరించకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరుగుతుందా..? లేదో వేచి చూడాల్సిందే మరి. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ, అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ ఎల్వీ సుబ్రహ్మణ్యం రాకపోతే, క్యాబినెట్ ఏమి చేస్తుంది అనేది కూడా ఆసక్తిగా మారింది.