ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్‌లోని ఒక మంత్రి చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం పంపారు. వైద్య, గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న కిడారి శ్రావణ్‌తో రెండు రోజుల్లో రాజీనామా చేయించాలని గవర్నర్ ఆదేశించినట్టు, రాజ్‌భవన్ నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తున్న వేళ, ఏపీ కేబినెట్ భేటీ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గవర్నర్ ఆదేశం ఇప్పుడు ప్రభుత్వంలో హాట్ టాపిక్‌గా మారింది. చట్టసభల్లో సభ్యుడు కాని ఆయన గతేడాది నవంబరు 11న చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్యాంగ నియమావళి ప్రకారం.. మంత్రిగా నియమితులైన వారు ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాలి. శ్రావణ్‌కు ఆరునెలల వ్యవధి ఈ నెల 10తో ముగుస్తుంది. 11 నుంచి ఆయన మంత్రిగా కొనసాగడానికి వీల్లేదు. ఆయన తండ్రి, అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడంతో శ్రావణ్‌కు మంత్రిగా అవకాశం లభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర శాసనసభకు గత నెల 11నే పోలింగ్ జరిగినా.. ఫలితాలు ఈ నెల 23న వెలువడతాయి. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరికొన్ని రోజులు పడుతుంది. పదో తేదీతోనే ఆరునెలల గడువు ముగుస్తుండడంతో రాజ్‌భవన్ అప్రమత్తమైంది. ఒక మంత్రి చట్ట సభల సభ్యుడు కాలేక ఆటోమేటిగ్గా పదవి కోల్పోవడం అవమానకరంగా ఉంటుందని, అందువల్ల పదో తేదీలోపే శ్రావణ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ సీఎంకు సూచించినట్లు తెలిసింది.
గత ఏడాది ఆయనను మావోయిస్టులు కాల్చి చంపారు. ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వదేశానికి తిరిగి రాగానే సర్వేశ్వర రావు కుమారుడి బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గత నవంబర్ 11న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించారు. కీలకమైన వైద్య..గిరిజన సంక్షేమ శాఖలు అప్పగించారు. అయితే, ఆయనకు ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించినా.. అలా చేయలేదు. గత నెల 11న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అరకు నుండి టీడీపీ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఇంకా ఫలితాలు రాలేదు. ఇదే సమయంలో ఆయనను మంత్రి పదవికి రాజీనామా చేయమని కోరాలని గవర్నర్ నరసింహన్ ఏకంగా ముఖ్యమంత్రికి సూచించారు.