కేంద్రంలో కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధాని రాబోతున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. సీబీఐ, ఈడీ, విజిలెన్స్ కమిషన్, ఆర్బీఐ తదితర సంస్థలన్నింటినీ మోదీ తన చెప్పుచేతుల్లో పెట్టుకుని... ప్రత్యర్థులను వేధించేందుకు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి- దేశాన్ని కాపాడాలి’’ నినాదంతో వివిధ రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయని అన్నారు. రాజకీయంగా కొన్ని విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత అందరం కలుస్తామని, ఎన్నికల తర్వాత అంతా కలిసి ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పారు. దిల్లీలో శుక్రవారం న్యూస్ ఎక్స్ ఆధ్వర్యంలో ‘‘ఇండియా నెక్ట్స్-2019 మెగా కాన్క్లేవ్’’లో అమరావతి నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా చంద్రబాబు మాట్లాడారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు, ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తామే గెలుస్తామని చెప్పారు. అవినీతిని ప్రోత్సహించారు.. పెద్ద నోట్లు రద్దు చేయమంటే వెయ్యి నోట్లు రద్దు చేసి రూ.2 వేలు నోట్లు ప్రవేశపెట్టి అవినీతిని ప్రోత్సహించారు. దీనికి పూర్తి బాధ్యత మోదీదే. అప్పట్లోనే కేంద్రం సరైన చర్యలు తీసుకునుంటే ఈ ఎన్నికల్లో ఇంత పెద్దఎత్తున డబ్బులు కుమ్మరించే పరిస్థితులుండేవి కావు. ఈ అయిదేళ్లలో దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టారు. ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక హామీల అమలు విషయంలో మోదీ మమ్మల్ని మోసం చేశారు. ఏపీ ప్రజలనే కాదు...దేశ ప్రజలను కూడా మోదీ మోసం చేశారు.
రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం... నాకు ఒక దార్శనికతతో కూడిన ప్రణాళిక ఉంది. నదులు అనుసంధానం చేయాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. అమరావతి నిర్మాణానికి ఒక రూపు రావాలి. కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చేయాల్సింది చాలా ఉంది. జాతీయ స్థాయిలో పలువురు సీనియర్ నాయకులతో కలిసి పనిచేస్తా. కాలం కంటే ముందు పరిగెత్తటం నా నైజం. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళతా. ఈ జాతి నిర్మాణంలో నా వంతు బాధ్యత పోషిస్తా. భారత్ లాంటి గొప్ప దేశానికి మంచి నాయకత్వం కావాలి. రాబోయే సంకీర్ణ ప్రభుత్వం ఆ నాయకత్వాన్ని అందిస్తుంది.