పర్యావరణం ప్రాణం తీసేస్తున్న అతి పెద్ద కారకం ప్లాస్టిక్. జీవనది కృష్ణమ్మ, దానికి అనుసంధాన కాల్వలను ఉసూరుమని పిస్తున్నది అదే. నీరు లేని నదీ గర్భంలో చూసినా, నీరున్న కాల్వలను తలదించి చూసినా ప్లాస్టిక్కే కనిపిస్తోంది. ఈ అంశమే ఇప్పుడు పర్యావరణ ప్రేమికులను ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు కాల్వల్లో అటూఇటూ తేలుతున్న చెత్తను ఎత్తడానికి చేపట్టిన ‘నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో...’ కళ్లు తేలేసే వాస్తవాలు కనిపిస్తున్నాయి. తొలిరోజున 300 టన్నుల వ్యర్థాలు బయటకు వస్తే, రెండో రోజు శుక్రవారం 800 టన్నుల వ్యర్థాలను బయటకు తీశారు. రెండు రోజుల్లో 1100 టన్నులు వ్యర్థాలను టిప్పర్లలో డంపింగ్ యార్డులకు తరలించారు. గాంధీనగర్లోని అలంకార్ సెంటర్ నుంచి కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, బాబూరావు, మున్సిపల్ కమిషనర్ రామారావు తదితరులు ర్యాలీ నిర్వహించి, ప్రజలకు కాల్వల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఏలూరు లాకు వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.
రెండు రోజుల్లోనే 1100 టన్నుల చెత్తచెదారం బయటకు వస్తే, దీన్ని నిరంతరం చేపడితే ఇంకెన్ని టన్నుల వ్యర్థాల కృష్ణమ్మ కడుపులో నుంచి బయటకొస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రక్షాళనకు ముందు నుంచి ‘అవార’ (అమరావతి వాకర్స్, అడ్వంచర్స్, అండ్ రన్నర్స్ అసోసియేషన్) నది శుభ్రతను భుజాన వేసుకుంది. 2012 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యంత్రాలను ఉపయోగించకుండా 200 టన్నుల వ్యర్థాలను ఎత్తిపోసింది కొద్దిరోజులుగా ప్లాస్టిక్ నిషేధంపై విజయవాడలో సమరశంఖం పూరించారు. అయినా దాని వాడకాన్ని ప్రజలు ఆపిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. బందరు, ఏలూరు, రైవస్ కాల్వల్లో బయటకు తీసిన వ్యర్థాల్లో అధికర శాతం ప్లాస్టిక్ కనిపించింది.
ముఖ్యంగా మురుగు నేరుగా నేరుగా కాల్వల్లోకి వచ్చి చేరుతోందని అధికారులు గమనించారు. దీనికి ముందుగా ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. రామలింగేశ్వరనగర్ కట్టకు ఎడమ వైపున ఉన్న ఇళ్లు, దుకాణాల నుంచి మురుగునీరు పైపుల ద్వారా బందరు కాల్వలోకి చేరుతోంది. ఏలూరు, రైవస్ కాల్వలోనూ ఇదే జరుగుతోందని గమనించారు. ఈ నీటిని తొలుతగా ఎస్టీపీ (సెకండరీ ట్రీట్మెంట్ ప్లాంట్)కు మళ్లించి అక్కడ శుభ్రం చేసిన తర్వాత బయటకు వదిలితేనే కాల్వల రూపురేఖలు కొంతవరకు మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.