కేంద్ర ఎన్నికల సంఘంపైనా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు అన్ని రాష్ట్రాల్లో సీఎస్‌లు వెళ్లి ముఖ్యమంత్రికి పరిస్థితులు వివరిస్తుంటే... మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎందుకు రావడం లేదని మండిపడ్డారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘నేను వెళ్లి అడుక్కోవాలా? ఆయనకు తెలియదా? చదువుకోలేదా? రాజ్యంగంలో ఎవరి పరిధులేంటో? ఎన్నికల విధులేంటో, ఎన్నికేతర పాలనా విధులేంటో తెలియవా? ఇక్కడ వ్యక్తులు ముఖ్యంకాదు. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కారు. అనుభవం కలిగిన వ్యక్తిగా వ్యవస్థల్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అధికారులు ఇష్టానుసారం ప్రవర్తిస్తాం, సమీక్షలు, సమావేశాలకు రామంటే కుదరదు. రోజువారీ పాలనా వ్యవహారాల్ని, పరిణామాల్ని కూడా ఈసీకే రిపోర్టు చేస్తారా?’’ అని మండిపడ్డారు.
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తప్ప... మిగతా అధికారులంతా బిజినెస్ రూల్స్ ప్రకారం రోజువారీ పాలనా వ్యవహారాల్లో తనకే నేరుగా రిపోర్టు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సమీక్షలకు అనుమతివ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రాసిన లేఖపై ఈసీ ఇంతవరకు స్పందించకపోవడం గురించి ప్రస్తావించగా... ‘‘వాళ్లు అనుమతి ఇవ్వరు కదా? అయినా వాళ్లిచ్చేదేంటి? రోజువారీ పాలనతో వాళ్లకేం సంబంధం? ప్రధాని మోదీ కేబినెట్ సమావేశాలు పెట్టడం లేదా? ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షలు చేయకూడదని, అధికారులు ఈసీకే రిపోర్టు చేయాలన్న రూల్ ఎక్కడుందో చూపించండి’’ అని సీఎం అన్నారు. ‘‘నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నది నేనొక్కడినే. నవ్యాంధ్రకు మొదటి సీఎంని. వాళ్ల సర్వీసంతా నా అనుభవం అంత ఉండదు. వాళ్లెవరు నాకు పాఠాలు చెప్పడానికి?’’ అని మండిపడ్డారు.
‘‘మోదీ 2002లో ముఖ్యమంత్రి అయ్యారు. 2014 వరకు అమిత్‌షా అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు వాళ్లిద్దరూ మమ్మల్ని మించిన నాయకులు లేరంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టుని సందర్శిస్తానని పేర్కొన్నారు. వచ్చేవారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించి పరిస్థితులు సమీక్షిస్తామని, అధికారుల్లో ఎవరు బిజినెస్ రూల్స్‌ని, ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, రాష్ట్ర అధికారులూ వింతగా ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రధాని మోదీ నిర్వాకాలకు వ్యతిరేకంగా... దేశం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పోరాడుతున్నాను. మోదీ ఏదో చేస్తారనో, ఐటీ, ఈడీలను పంపిస్తారనో భయపడను. ఆ విషయాన్ని ఈసీ కూడా గుర్తు పెట్టుకోవాలి. ’ అని ఆయన వ్యాఖ్యానించారు.