వచ్చేవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల కోడ్ పేరిట ‘బిజినెస్ రూల్స్’ను ఉల్లంఘిస్తున్న అధికారుల తీరుపై చర్చిస్తామని తెలిపారు. శుక్రవారం చంద్రబాబు ఉండవల్లి ప్రజా వేదికలో మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కోడ్ అడ్డుకాదా అని ప్రశ్నించగా... ‘‘నియమావళి అమలులోకి వచ్చాక ప్రధానమంత్రి మోదీ నాలుగు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకున్నారు. ఎన్నికల కోడ్ ఆయనకు వర్తించదా? మాకే వర్తిస్తుందా?’’ అని ప్రశ్నించారు.
ఒకవేళ మంత్రివర్గ సమావేశం పెట్టేందుకు వీల్లేదంటే... ఆ విషయం ఎన్నికల సంఘం రాతపూర్వకంగా చెప్పాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తీరుపై ఆయన మరోసారి మండిపడ్డారు. కోడ్ ఉన్నప్పుడు కూడా ఆయా రాష్ట్రాల సీఎస్‌లు ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. ‘‘ఇక్కడ మాత్రం సీఎస్ సమీక్షలకు రారట! రిపోర్టు చేయరట! రమ్మని నేను అడగాలా? అధికారులకు బిజినెస్ రూల్స్ నుంచి అధికారాలు సంక్రమిస్తాయి. ఆ బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా వెళ్లడం ఏంటి? ఆయన నిబంధనలు చదువుకోలేదా? బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.
అధికారుల్లో విభజన తీసుకురావడం తన ఉద్దేశం కాదని... కానీ, నిబంధనలకు విరుద్ధంగా, అతి చేసేవాళ్లు మాత్రం సరి కావాలన్నారు. వ్యవస్థలే వారిని సరిచేస్తాయని వ్యాఖ్యానించారు. ‘‘సీఎ్‌సగా మూడునెలలు ఉంటారు. నిబంధనల మేరకు వ్యవహరించాలి. ఎన్నికలకు సంబంధించిన విధులు వేరు. సాధారణ పరిపాలన వేరు. రోజువారీ పాలనకు సంబంధించిన అంశాల్లో సీఎంకే సీఎస్ నివేదించాలి. ఎవరికివారు బాధ్యతగా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే వ్యవస్థే సరిచేస్తుంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారం పోలవరం సందర్శనకు వెళ్లి పనుల పురోగతిని పర్యవేక్షిస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, సదరు ఫైలు ఇంకా తమ వద్దకు రాలేదన్నారు. దీనిపై ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్ణయం తీసుకుంటామన్నారు.