రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల నియామకం ఫైలు గత పాతిక రోజులుగా గవర్నర్ నరసింహన్ వద్దే పెండింగ్లో ఉందని సమాచారం. ఇద్దరు కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఫైలు మార్చి నుంచీ ప్రభుత్వానికి-గవర్నర్కు మధ్య తిరుగుతోంది. మార్చి 7న అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు ఆర్టీఐ కమిషనర్లుగా విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య కుమారుడు ఐలాపురం రాజా, విశాఖపట్నం జిల్లాకు చెందిన వీఆర్ఏల సంఘం మాజీ నేత ఈర్ల శ్రీరామమూర్తి పేర్లను సిఫారసు చేస్తూ ప్రభుత్వం గవర్నర్కు ఫైలు పంపించింది. కమిషనర్ల నియామకానికి ఏర్పాటుచేసిన కమిటీలో సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. జగన్ రాకపోవడంతో ఈ కమిటీ సమావేశం రెండుసార్లు వాయిదా పడింది.
మూడోసారి ఇద్దరు సభ్యులతోనే సమావేశం జరుగగా.. రాజా, శ్రీరామమూర్తి పేర్లను కమిటీ సిఫారసు చేసింది. 7న పంపిన ఈ ఫైలును 10వ తేదీవరకు గవర్నర్ అట్టే పెట్టుకున్నారు. 10న ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లో ఉన్నందున తర్వాత చూద్దామని గవర్నర్ 11వ తేదీన ఫైలును తిప్పిపంపారు. దీంతో ఈ అంశాన్ని కోడ్ అమల్లో ఉన్నప్పుడు వ్యవహారాలు చూసే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీకి పంపించారు. అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ద్వివేది ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఎన్నికల సంఘం దీనికి ఆమోదం తెలుపుతూ మార్చి 29న సమాచారం అందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏప్రిల్ తొలివారంలో మళ్లీ గవర్నర్ వద్దకు పంపించింది. ఇప్పటివరకు అక్కడినుంచి ఆమోదం రాలేదని సమాచారం.
రాష్ట్రంలో సమాచార హక్కు కమిషనర్లను నియమించాలంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. 3 నెలల్లోగా నియమాకాలు జరగాలని నిర్దేశించింది. రాష్ట్రంలో ఆర్టీఐ కమిషన్ ముందు దాదాపు 15వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం కమిషనర్ల నియామకం అత్యవసరం.. భర్తీ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. ఐలాపురం రాజా పేరుపై గవర్నర్ కొన్ని అభ్యంతరాలు అడిగారని, శ్రీరామమూర్తి పేరుకు ఆమోదం తెలిపారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అసలు ఆ ఫైలుపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో ఉంచారని సమాచారం.