టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మే-01న ఏపీలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఎన్నికల కోడ్ నిబంధనల అడ్డంకులతో ఏపీలో రీలీజ్ చేయలేపోయిన చిత్రబృందం మే-1న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేసింది. తాజాపరిణామాలను చూస్తే రెండోసారి కూడా రిలీజ్ కష్టమేనని తెలుస్తోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర విడుదలపై ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తేల్చిచెప్పింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఏప్రిల్ 10న ఈసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఈసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కాగా.. ఆర్జీవీ మూవీతో పాటు మరో రెండు చిత్రాలపై ఏప్రిల్ 10న ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. మార్చి 10 నుంచి కోడ్ అమల్లోకి రావడంతో బయోపిక్‌ల విడుదలపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ సినిమాల ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో సినిమాల విడుదలపై ఆంక్షలు విధించడం జరిగింది. కాగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఏప్రిల్ 10న జారీ చేసిన ఆదేశాలు అమల్లో ఉంటాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా రిలీజ్ చేసుకోవచ్చని ఇంతవరకూ ఈసీ ఎక్కడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని అధికారులు చెబుతున్నారు. సినిమా థియేటర్లలో ప్రదర్శనలకు అనుమతి ఇవ్వొద్దని ఎన్నికల సంఘం సూచించింది.
ఇదిలా ఉంటే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఎన్నికల సంఘం పంపింది. ఏప్రిల్ 25న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల కోరుతూ ఎన్నికల సంఘానికి ఆర్జీవీ లేఖ రాయడంతో ఉత్తర్వులు ఇలా జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వుల ప్రకారం తాము నడుచుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. మొత్తానికి చూస్తే.. ఆర్జీవీ తెరకెక్కించిన మూవీ రెండోసారి విడుదలకు కూడా బ్రేక్ పడినట్లేనని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యవహారంపై వర్మ ఎలా ముందుకెళ్తారు..? అసలు సినిమా రిలీజ్ అవుతుందా..? కాదా..? అనేది తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే మరి. కాగా ఇంత జరుగుతున్నా చిత్రబృందం మాత్రం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.