రాష్ట్రవ్యాప్తంగా ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరగనుంది. నెల్లూరు జిల్లాలో రెండు, గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశంలో ఒక చోట రీపోలింగ్‌కి ఎన్నికల సంఘానికి ఆయా కలెక్టర్లు నివేదికలు పంపారు. దీంతో ఈ ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. ఇందుకు అంగీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం... రీ-పోలింగ్ ఎప్పుడు నిర్వహించేదీ మంగళవారం (ఏప్రిల్ 16) రాత్రికి ప్రకటిస్తామని తెలిపింది. ఈ ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన స్క్రూటినీ రిపోర్టులను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించింది.
ఈ పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలకు తోడు... ఈవీఎంల మొరాయింపు ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తాయని కలెక్టర్లు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. వాటి ఆధారంగా రాష్ట్ర ఈసీ... కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. శాంతి భద్రతల సమస్య తలెత్తిన ఈ ఐదు కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును సరిగా వినియోగించుకోలేకపోయారని జిల్లాల కలెక్టర్లు స్క్రూటినీ రిపోర్టుల్లో తెలిపారు. అందువల్ల మరోసారి ఎన్నికలు జరిపేందుకు ఈసీఐ సిద్ధపడింది. ఇదే సమయంలో... ఏపీలోని ఆత్మకూరు, మచిలీపట్నం, విశాఖలో వీవీ ప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల తరలింపుపై అధికారులపై చర్యలకు ఈసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అటు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలంపై ఈసీ సీరియస్ అయింది. ఆర్వో, ఏఆర్వోలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనలో నిజా నిజాలు పోలీస్ విచారణలో నిగ్గుతేలుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఎన్నికల విధుల్లోని సిబ్బంది పొరపాట్లు చేస్తే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.