దేశంలో ఈవీఎంల పని తీరు పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరు, టాంపరింగ్‌పై వివాదం నెలకొంది. అనుమానాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ముందుండి ఈ పోరాటం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు పెనమలూరు ఈవీఎంల తరలింపు విషయంలో, సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పోలింగ్ ముగిసిన 12 గంటల తర్వాతా ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలకు చేరలేదు. ఈవీఎంలను రిటర్నింగ్ అధికారి ఆలస్యంగా తీసుకెళ్లడాన్ని ఎన్నికల పరిశీలకులు గుర్తించి స్వీకరించేందుకు తొలుత నిరాకరించి, తర్వాత తీసుకుని సంతకం చేసినట్లు తెలిసింది. పార్లమెంటు పరిశీలకుడు సంతకం చేయలేదని తెలిసింది. ఈవీఎంల రవాణాకు జాప్యం జరగడంపై ఆ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సమాధానం ఉన్నతాధికారులకు దిమ్మ తిరిగింది.
3 రోజులుగా నిద్ర లేదని, తాను నిద్రపోయి రావడంవల్ల జాప్యం అయిందని ఆ ఆర్వో వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఈవీఎంలు పెద్దగా మొరాయించలేదు. కేవలం 2 కంట్రోల్ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌నే మార్చాల్సి వచ్చింది. కానూరు పంచాయతీలో ఒక బూత్, యనమలకుదురులో రెండు బూత్‌లు, వణుకూరులో ఒక బూత్‌లో అర్థరాత్రి 12 గంటలవరకు పోలింగ్ జరిగింది. పెనమలూరు నియోజకవర్గ పంపిణీ కేంద్రం సమీపంలోని దనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూంలు మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం భవనాల్లో ఏర్పాటు చేశారు.
11 వతేదీ అర్థరాత్రి లోపే పోలింగ్ ముగిస్తే.. 12 వతేదీ రాత్రి 9 గంటలకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూంకు వెళ్లాయి. ఆలస్యంగా రావడంవల్ల తాము స్వీకరించబోమని ఎన్నికల పరిశీలకులు గణేష్‌కుమార్, బినోద్ జాన్ నిరాకరించారు. ఆ తర్వాత తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే, మచిలీపట్నం స్ట్రాంగ్‌రూంల నుంచి ఈవీఎంల తరలింపు వ్యవహారంలో నూజివీడు సబ్‌కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఏఆర్‌వోగా ఉన్న నూజివీడు తహసీల్దార్ పి.తేజేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. రిజర్వు ఈవీఎంలను మచిలీపట్నం కేంద్రానికి తీసుకెళ్లి తిరిగి వాటిని వాహనంలో తరలించిన అంశం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ సీరియస్ అయింది.