సార్వత్రిక ఎన్నికల మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ దుమారానికి తెరతీసింది. 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్న కేంద్రానికి, ఎన్నికల వేళ, రాహుల్ గాంధీ భారతీయుడు కాదు అనే డౌట్ వచ్చింది. ఇది ఎంత సిల్లీగా ఉందో కదా. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వ స్థితిని ప్రశ్నిస్తూ దాఖలైన ఒక ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ ఆయనకు నోటీసు జారీ చేసింది. పదిహేను రోజుల్లోగా దీనిపై వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని స్పష్టంచేసింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసు జారీ అయ్యింది. 2017 సెప్టెంబర్‌లో ఆయన ఈ ఫిర్యాదు చేశారని, ఇటీవల దాన్ని గుర్తుచేస్తూ ఆయన మరోసారి లేఖ రాశారని హోంశాఖ పేర్కొంది.
‘‘2003లో బ్రిటన్‌లో రిజిస్టర్ అయిన ‘బ్యాకాప్స్ లిమిటెడ్’ అనే కంపెనీలో మీరు డైరెక్టర్‌గా ఉన్నట్లు ఆ ఫిర్యాదులో ఉంది. 2005 అక్టోబర్ 10న, 2006 అక్టోబర్ 31న బ్రిటన్ కంపెనీ తన వార్షిక రిటర్న్‌లను దాఖలు చేసింది. అందులో మీ జన్మదినాన్ని 1970 జూన్ 19గా పేర్కొంటూ, మీరు బ్రిటన్ జాతీయుడని రాసి ఉంది. 2009 ఫిబ్రవరి 17న దాఖలు చేసిన రద్దు దరఖాస్తులోనూ మీ జాతీయతను బ్రిటిష్‌గా పేర్కొన్నట్లు సదరు ఫిర్యాదు ఆరోపించింది. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని పక్షం రోజుల్లోగా వివరించాలి’’ అని కేంద్ర హోంశాఖ తన నోటీసులో పేర్కొంది. రాహుల్ పౌరసత్వంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ 2015 నవంబర్‌లో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది. ఒక వ్యక్తి లేదా సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రజాహిత వ్యాజ్యాలను ఉపయోగించరాదని పేర్కొంది. ఈ వ్యాజ్యంలో దాఖలు చేసిన పత్రాల వాస్తవికతను ప్రశ్నించింది.
2016లో సుబ్రమణ్య స్వామి ఇదే తరహా ఫిర్యాదును చేస్తూ రాహుల్ గాంధీ ‘నైతికపరమైన దుష్ప్రవర్తన’కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ భాజపా అగ్రనేత ఆడ్వాణీ నేతృత్వంలోని పార్లమెంటరీ నైతికవిలువల కమిటీకి నివేదించారు. నాడు రాహుల్ ఈ కమిటీకి సమాధానమిస్తూ తాను ఎన్నడూ బ్రిటన్ పౌరసత్వాన్ని కోరడం కానీ పొందడం కానీ చేయలేదన్నారు. వ్యవసాయ సంక్షోభం, నల్లధనంపై ప్రధాన మంత్రి వద్ద జవాబులు లేవని, వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ఆయన తప్పుడు వాదనను తెరపైకి తెస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. రాహుల్ జన్మతః భారత పౌరుడన్న విషయం ప్రపంచం మొత్తానికీ తెలుసన్నారు. కేంద్ర హోంశాఖ చర్యను ‘చెత్త’గా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ అభివర్ణించారు. ఆయన భారత్‌లోనే పుట్టి, పెరిగిన విషయం అందరికీ తెలుసన్నారు. ఈ నోటీసుపై వివాదం చెలరేగడంతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. అది సాధారణ ప్రక్రియేనని, ఇది పెద్ద పరిణామం కాదని పేర్కొన్నారు.