గత రెండ్రోజులుగా ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలకు అధికారులు, కమిషనర్లు రాకపోవడంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు ఎవరు రాలేదు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ఎన్నికల కమిషన్ స్పందించింది. రాష్ట్రంలో తుపాను ప్రభావంతో పంటనష్టం, అకాల వర్షాలు, కరవు లాంటి ప్రకృతి వైపరీత్యాలపై సోమిరెడ్డి నిర్వహించాల్సిన సమీక్షకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు సాయంత్రం (శుక్రవారం సాయంత్రం) సచివాలయంలో మంత్రి సోమిరెడ్డి ఛాంబర్లోనే సమీక్షా సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశానికి వ్యవసాయశాఖ, ఉద్యావన శాఖ ప్రత్యేక కమిషనర్లు అధికారులు హాజరయ్యేందుకు ఈసీ అనుమతించింది.
రెండు రోజులుగా సోమిరెడ్డి సమీక్షకు వచ్చి వెనుతిరిగారు. సోమిరెడ్డికి మంగళవారం ఎదురైన పరిస్థితి మరోసారి బుధవారం కూడా ఎదురైంది. మంగళవారం వ్యవసాయ శాఖ పైన మంత్రి సమీక్ష ఏర్పాటు చేసారు. అయితే, ఉన్నతాధికారులు ఎవరూ ఈ సమీక్షకు హాజరు కాలేదు. దీంతో.. రెండు గంటల పాటు ఎదురు చూసిన మంత్రి సోమిరెడ్డి చివరకు సమీక్ష రద్దు చేసుకొని వెళ్లిపోయారు. అదే విధంగా బుధవారం ఉద్యానవన శాఖ పైన మంత్రి సమీక్ష ఏర్పాటు చేసారు. అయితే, అధికారులు రావటం లేదని తెలుసుకున్న మంత్రి సమీక్షను రద్దు చేసారు. అసహనానికి గురైన మంత్రి తనకు మంత్రి పదవి కొత్త కాదని.. ఎన్నికల సంఘంతో తేల్చుకోవటానికి సిద్దమని ప్రకటించారు.
ఏపీలో కరువు..తుఫాను వంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే ఎలా తప్పవుతుందని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. సాధారణ పరిపాలనకు ఆటంకం కలిగిస్తారా అని నిలదీసారు. ముఖ్యమంత్రి సమీక్షలు చేయవద్దని చట్టంలో ఎక్కడైనా ఉందా అంటూ అసహనం వ్యక్తం చేఉసారు. తెలంగాణాకో న్యాయం..ఏపీకో న్యాయం అనే విధంగా వ్యవహరించటం సరి కాదన్నారు. కరువు..ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమీక్షలు చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలని సూచించారు. ఇక, ఎన్నికల సంఘం..ప్రభుత్వం మధ్య అధికారులు ఎవరి మాట వినాలో..ఏం చేయాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. అయితే మొత్తానికి, ఎలక్షన్ కమిషన్ పై పోరాడి, సమీక్షకు ఒప్పుకునేలా సోమిరెడ్డి చేసారు.