ఓట్ల లెక్కింపు సమయంలో వీవీప్యాట్ స్లిప్పుల ఫలితాలే అంతిమమని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఈవీఎంల ఫలితాలు, వీవీప్యాట్ ఫలితాల్లో తేడాలు వస్తే.. వీవీప్యాట్ ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చాయని బుధవారం విలేకరులకు తెలిపారు. ప్రతి అసెంబ్లీకి ఐదు చొప్పున వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని, అసెంబ్లీ, లోక్‌సభ పరిధిలో వేర్వేరుగా స్లిప్పులను లెక్కిస్తామని చెప్పారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాకే ఈ స్లిప్పులు లెక్కిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక దాని తర్వాత మరో వీవీప్యాట్‌లో లెక్కింపు జరుగుతుందన్నారు.
‘నియోజకవర్గంలో ప్రతి పోలింగ్‌స్టేషన్‌కు ఒక్కో గుర్తింపు కార్డు ఉంటుంది. కార్డుపై వివరాలు కనిపించకుండా లాటరీ ద్వారా వీవీప్యాట్ల ఎంపిక చేపడతాం. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో కంటైనర్ ద్వారా వీవీప్యాట్ కార్డుల ఎంపిక ఉంటుంది. ఆర్వో, అబ్జర్వర్ల సమక్షంలోనే వీవీప్యాట్ స్లిప్లుల కౌంటింగ్ జరుగుతుంది. ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే మరో 2-3 సార్లు ఈవీఎంలను, వీవీప్యాట్ స్లిప్పులను రీ కౌంటింగ్ చేస్తాం. లెక్కలు సరిపోలకపోతే వీవీప్యాట్‌లో వచ్చిన ఓట్లే పరిగణనలోకి తీసుకుంటాం. 23వ తేదీ ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఇది మొదలైన అరగంటకే ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతాం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే పరిస్థితులు ఉంటే.. పోస్టల్ బ్యాలెట్లను మరోసారి లెక్కిస్తాం’ అని ద్వివేది వెల్లడించారు.
అయితే ప్రజలు మాత్రం, ద్వివేది చెప్పిన విషయంతో ఆశ్చర్యపోతున్నారు. వీవీప్యాట్- ఈవీఎంల మధ్య తేడా వస్తే, వీవీప్యాట్ లను పరిగణలోకి తీసుకోవటం ఎంతో అర్ధం కావటం లేదని అంటున్నారు. వీవీప్యాట్-ఈవీఎం మధ్య తేడా ఉంది అంటే, అక్కడ ఎన్నికల ప్రక్రియ తేడా జరిగినట్టే కదా అని, ఇప్పుడు చంద్రబాబు, దేశంలో 21 పార్టీలు చేసే పోరాటం ఇదే కదా అంటూ, ఈసీ పై మండి పడుతున్నారు. ఎదో ఒకటి పరిగణలోకి తీసుకుంటామంటూ, ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ అపహాస్యం చేస్తుందని అంటున్నారు. రెండిటి మధ్య తేడా ఉంటే, అక్కడ ఎన్నికల ప్రక్రియ ట్యాంపరింగ్ జరిగినట్టు అనే ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకుర్చినట్టే కదా, దీని పై సమగ్రమైన విధానం ఎన్నికల కమిషన్ తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.