గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి తనకు ప్రాణ హాని ఉందని, వెంటనే తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి వెళ్లారని పేర్కొన్న ఆయన అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఉందని తెలిపారు. తనకు ‘సన్మానం’ చేసేందుకు ఇంటికి వస్తానని వంశీ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. వారం రోజులుగా ఆయన బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్న యార్లగడ్డ తనకు వెంటనే గన్‌మెన్‌ను కేటాయించాలని కోరారు. కావాలంటే సీసీ టీవీఫుటేజ్ చూడాలని కోరారు. తనకు గన్మెన్లు కేటాయించాలని యార్లగడ్డ వెంకట్రావు సీపీని కోరారు.
ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన రోజు కూడా యార్లగడ్డ, వంశీ పై గొడవకు దిగారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ప్రసాదంపాడు బోర్డింగ్ పాఠశాలలోని 47వ నెంబరు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతరం పలు దఫాలుగా ఈవీఎం మొరాయిస్తుండటం, ఒక అభ్యర్థికి ఓటేస్తే వేరొకరికి ఓటు పడుతున్న విషయంపై ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవీఎంకు మరమ్మతులు చేపట్టిన అధికారులు సాయంత్రం 6 గంటల అనంతరం కూడా పోలింగ్‌ను కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల సమయానికి 350 మంది ఓటు వేసేందుకు వరుసలో ఉన్నారు. వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రం చిన్నది కావడంతో.. 100 మంది వరకూ మాత్రమే లోపల ఉన్నారు. మిగిలిన వారు కేంద్రం బయట వేచి ఉన్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పటమట సీఐ.. బయట ఉన్నవారంతా వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈవీఎం మొరాయించడంవల్ల తాము ఉన్నామని ఓటర్లు పోలీసుల వైఖరిపై ఎదురుతిరిగారు.
అదే సమయంలో అక్కడకు చేరుకున్న గన్నవరం వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నిర్ణీత సమయం ముగియడంతో ఓట్లు వేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. స్థానిక నాయకుల సమాచారంతో గన్నవరం తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఈవీఎంలో లోపాల వల్ల నెలకొన్న జాప్యానికి అందరికీ అవకాశం ఇవ్వాలంటూ పట్టుపట్టారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత నేపథ్యంలో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. తర్వాత కొద్దిసేపటికి వంశీ వెళ్లిపోయారు. అనంతరం వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు, ఆ పార్టీ నాయకుడు యలమంచిలి రవి, వైకాపా కార్యకర్తలు మాత్రం ఆందోళనను విరమించలేదు. పోలీసులు సర్దిచెప్పడంతో వారు కూడా వెళ్లిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వంశీని రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.