ఇటీవల కొందరు రాజకీయ నాయకులపై ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం దాడులు చట్టప్రకారమే జరిగాయని, రాజకీయ ప్రతీకారంతో ఎంతమాత్రం భాగం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కేవలం ప్రతిపక్షాల మీదే ఐటి దాడులు జరుగుతూ, వాళ్ళతో స్నేహంగా ఉన్న జగన్, కేసీఆర్, అన్నాడీయంకే లాంటి పార్టీల పై, ఐటి దాడులు జరగకపోతే, ప్రధాని మాత్రం, అన్నీ చట్ట ప్రకరామే జరుగుతున్నాయి, మాకు ఏమి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు. అంతే కాదు, తనకు శపించే శక్తి ఉందని, తాను శపించినందునే ముంబై ఏటీఎస్ అధికారి హేమంత్ కర్కరే మరణించారని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాలేగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వీ ప్రాగ్యా సింగ్ ఠాకూర్ ను ప్రధాని నరేంద్ర మోదీ సమర్థించారు. ప్రాగ్యాకు పూర్తి మార్కులేసిన ఆయన, హిందూ నాగరికతపై ఉగ్రవాదం మచ్చ వేసే నేతలకు ఆమె సమాధానంగా నిలుస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.
గడచిన 5 వేల ఏళ్లుగా వసుధైన కుటుంబంలా ఉన్న హిందూ సంస్కృతిని కొందరు ఉగ్రవాదమని వ్యాఖ్యానిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు భారీ మూల్యం చెల్లించుకోవాలంటే ప్రాగ్యా సింగ్ వంటి వారుండాలని 'టైమ్స్ నౌ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. "ఒక మహిళా సాధ్విని అంత క్రూరంగా విమర్శించరాదు" అని ఆయన అన్నారు. సంఘౌతా కేసులో తీర్పును గుర్తు చేసుకుంటూ, నిందితులు ఏ సాక్ష్యమూ లేకుండా శిక్షించబడ్డారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 1984లో వేలాది మంది సిక్కులను హత్యలు చేయించిందని, ఆ పార్టీకి విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.
సిక్కుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్ నేతలు ఎంపీలయ్యారని, క్యాబినెట్ మంత్రులుగానూ పనిచేశారని, ఆ పార్టీ ఆరోపణలున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ లో సీఎంగా ఎంచుకుందని మోదీ నిప్పులు చెరిగారు. బెయిల్ పై బయటకు వచ్చిన సాధ్వి ప్రాగ్యకు టికెట్ ఎలా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆయన, అదే బెయిల్ పై బయట తిరుగుతూ రాయ్ బరేలీ, అమేథిల నుంచి పోటీ చేస్తున్న వారిని ఇవే ప్రశ్నలు ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. "అమేథి, రాయ్ బరేలీలో కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నవారు బెయిల్ పైనే బయట ఉన్నారు. దీనిపై చర్చ లేదు. అదే భోపాల్ లో మా అభ్యర్థి బెయిల్ పై ఉంటే విమర్శల తుఫాను సృష్టిస్తున్నారు. ఇదేం పద్ధతి?" అని ఆయన అన్నారు. అయితే ఇదే సందర్భంలో కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, పిఎంఓ లోనే ఉంటున్న విజయసాయి రెడ్డి, జగన్ ను మనం గుర్తుంచుకోవాలి.