మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. "మీ నాన్న రాజీవ్ గాంధీ జీవితం దేశంలో నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగిసింది" అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అమర్యాదకర ప్రవర్తనను ఎవరూ ఆశించబోరని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పదవి వంటి అత్యున్నతస్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి ఎవరైనా సభ్యత, సంస్కారం, హుందాతనం ఆశిస్తారని, కానీ, ఈ వ్యాఖ్యలు ప్రధాని నీచ మనస్తత్వానికి ప్రతీకలుగా భావించాల్సి వస్తోందని తెలిపారు.
ఇవాళ మన మధ్యలేని దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ విమర్శలు చేయడాన్ని తాము ఖండిస్తున్నట్టు చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు నాగరికత సరిహద్దులు దాటి వ్యక్తి గౌరవమర్యాదలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని వివరించారు. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించుకున్నారన్న ప్రధాని మోడీ కామెంట్లపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. "మోడీ జీ.. యుద్ధం ముగిసింది. ఖర్మ ఫలం ఎదురుచూస్తోంది. నా తండ్రిపై చేసే విమర్శలు మిమ్మల్ని ఎన్నటికీ కాపాడలేవు, ప్రేమతో ఓ కౌగిలింత" అంటూ ట్వీట్ చేశారు.
రాజీవ్ గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. మాజీ ప్రధానిపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారణేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయవద్దని బీజేపీ నిర్ణయించిన విషయం మోడీకి తెలుసా అని ప్రశ్నించారు. ప్రజా సేవలో ఉండి మరణించిన వ్యక్తిని విమర్శించి మోడీ అన్ని హద్దులు దాటేశారని చిదంబరం మండిపడ్డారు. మరోవైపు మోడీ కామెంట్లపై ప్రియాంక గాంధీ సైతం స్పందించారు. అమరుల పేర్లు చెప్పుకుని ఓట్లు అడిగే మోడీ.. ఒక గొప్ప వ్యక్తి బలిదానాన్ని అగౌరవపర్చడం ఆయన విజ్ఞతకు నిదర్శనమన్నారు. మోడీకి అమేథీ ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెబుతారని ప్రియాంక అభిప్రాయపడ్డారు.