గత కొద్ది రోజులుగా గన్నవరం నియోజకవర్గంలో టెన్సన్ వాతావరణం నెలకొంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమను బెదిరిస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, బాలవర్దన రావు నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వంశీ తమ ఇంటికొచ్చి సన్మానం చేస్తానంటూ ఫోన్ చేస్తున్నాడని, తమ ఇంటికి కూడా వచ్చాడని ఫిర్యాదులో పేర్కొని.. సీసీ టీవీ ఫుటేజీని కూడా సీపీకి అందజేయడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించిన సీపీ ఈ ఘటనపై విచారణ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఫిర్యాదుపై, వెంకట్రావు ఆరోపణలపై ఇంత వరకూ స్పందించని వంశీ.. వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఎట్టకేలకు రియాక్టయ్యారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డకు వంశీ బహిరంగ లేఖ రాశారు.
వంశీ బహిరంగ లేఖ... "సత్సంబంధాలను కొనసాగించేందుకే మీ ఇంటికి వస్తానని నేను ఫోన్ చేశాను. మీ అపాయింట్‌మెంట్ కోసమే ఫోన్ చేశాను.. అందులో భాగంగానే మా అనుచరులను మీ ఇంటికి పంపా. నేను మీ ఇంటికి రావడం ఇబ్బంది అయితే మీరే మా ఇంటికి రండి. మీరు సమయం, తేదీ చెబితే నేను సిద్ధంగా ఉంటాను. ఓ కప్పు కాఫీతాగి వెళ్లొచ్చు. మీ అనుచరులను కూడా మీవెంట తీసుకు రండి. మా అనుచరులను మీ ఇంటికి పంపిస్తే నేను బెదిరిస్తున్నానని మీరు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసినట్టు పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాను. మీరు నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు మీరు ఎవరో తెలియదు.. కొడాలి నాని ద్వారానే పరిచయం అయ్యారు. మీరు గన్నవరం రాకముందు రెండు కేసుల్లో మీకు సాయం చేశాను. మీరు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడున్నాడు అన్నీ ఆయనకు తెలుసు.. అందరికీ దేవుడే న్యాయం చేస్తాడు" అని బహిరంగ లేఖలో వంశీ నిశితంగా వివరించారు. అయితే ఈ లేఖపై వెంకట్రావు.. వెంకట్రావును వంశీకి పరిచయం చేసిన కొడాలి నాని, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
ఇప్పటికే అనుచరులు స్పందన..! ఇదిలా ఉంటే.. వైసీపీ నేతల కారణంగా గన్నవరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని, రాజకీయ కక్షలు పెరుగుతున్నాయని వీటన్నింటినీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకే వంశీ వారికి ఫోన్ చేశారే తప్ప వేరే ఉద్దేశం లేదని ఇప్పటికే వల్లభనేని అనుచరులు వివరించిన విషయం విదితమే. దాడులు చేయడం, విద్వేషపూరిత రాజకీయాలు చేయడం అలాంటి ఉద్దేశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కౌంటింగ్ రోజు (మే-23) వరకు గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు.