2019 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి సంపూర్ణమైన మెజార్టీ సాధించి, సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ మోడీ నుంచి అమిత్ షా దాకా, బీజేపీ నేతలు తోడ కొట్టి మరీ దేశం అంతా తిరిగి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కాని బయట ప్రజలకి, విశ్లేషకులకు బీజేపీ గెలుపు పై ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి. అయితే ఇప్పుడు సొంత పార్టీలోనే, బీజేపీ గెలుపు పై అనుమానాలు మొదలయ్యాయి. 5వ దశ పోలింగ్ జరుగుతున్న వేళ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాత్రం మెజార్టీ విషయంలో కొంత అనుమానాన్ని వ్యక్తం చేశారు. క్లీన్ మెజార్టీకి బీజేపీ కొంత వెనుకబడే అవకాశం ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. 543 సీట్లుండే లోక్ సభలో 271 సీట్లను సొంతంగా గెలుచుకుంటే అంతకంటే ఆనందం మరొకకటి ఉండదని... కొన్ని సీట్లు తగ్గుతాయనే అంచనా వచ్చినట్టు, కాని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పై కూడా నోరు పారేసుకున్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు జాతీయ రాజకీయాల్లో కింగ్మేకర్లు కావాలని కలగంటున్నారని, తమ వద్ద కింగే ఉన్నప్పుడు అలాంటి వాళ్లతో పనేలేదని రాంమాధవ్ అన్నారు. మే 23న ఫలితం ఏమొస్తుందో ప్రజలకు ఇప్పటికే తెలుసని, మోదీయే మళ్లీ ప్రధాని అవుతారన్నారు. దేవెగౌడ లాంటి ప్రాంతీయ పార్టీ నేత ప్రధాని అయినప్పుడు తామెందుకు కాలేమని ప్రాంతీయ పార్టీల నేతలు భావిస్తున్నారని విమర్శించారు. భారత్ సమర్పించిన ఆధారాల వల్లే మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిందని చెప్పారు.
కర్ణాటక ఎన్నికలు కాగానే సంచలనాలు చూస్తారు. అప్పుడు ఏపీ సంగతి, ఇక్కడి ముఖ్యమంత్రి సంగతి చూస్తామంటూ బరితెగించి బీజేపీ నేత రామ్ మాధవ్ చేసిన హెచ్చరికలు తెలిసిందే. ఆ తర్వాత ఏం అయిందో కూడా అందరూ చూశారు. ఇవి కూడా అలాంటివే అంటున్నారు. దక్షిణాదిలో ఠికాణా లేని బీజేపీకి చివరకి చంద్రబాబు, కేసీఆర్, కుమారస్వామి, స్టాలిన్ వంటి నేతల సత్తా ఏంటో మే 23 తర్వాత తెలిసి వస్తుందని తెలుగు నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. కర్నాటక ఎన్నికల తర్వాత, అలాగే కాశ్మీర్లో పీడీపీతో పొత్తు విఫలం అయి బీజేపీ ప్రభుత్వం పడిన తర్వాత రామ్ మాధవ్ పలుకుబడి పార్టీలో బాగా తగ్గింది. కర్నాటక ఎన్నికల పోలింగ్ ముగియగానే రామ్ మాధవ్ అయితే ట్విటర్లోనే చంద్రబాబును హెచ్చరించినంత పని చేసారు. అయితే మధ్యాహ్నం ఫలితాల సరళి మారి బీజేపీకి సీన్ లేదని తెలిసిన తర్వాత ఇక సదరు రామ్ మాధవ్ కనిపించనే లేదు. ఇప్పుడు ఇది కూడా ఇంతే అంటున్నారు విశ్లేషకులు....