దేశం గర్వించదగ్గ మహోన్నత పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై వైయస్ ఆత్మ కేవీపీ విషం చిమ్ముతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. భాజపా, వైకాపా కోవర్టుగా పని చేస్తున్న కేవీపీ పోలవరం నిర్మాణ రికార్డులు చూసి సిగ్గుపడాలన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞoగా మార్చి డబ్బులు దండుకున్న కేవీపీ పోలవరంపై ఉత్తరాలు రాయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. పోలవరానికి ఖర్చు పెట్టిన నిధులు రాకుండా ప్రధాని కార్యాలయం అడ్డుపడుతున్నా నోరెందుకు మెదపరని ప్రశ్నించారు. కేసీఆర్ పోలవరం మీద సుప్రీంకోర్టులో కేసులు వేశారని.. గ్రీన్ ట్రైబ్యునల్‌లో కవిత కేసు వేశారని అవి మీ దృష్టిలో లేవా అని ఉమ ప్రశ్నించారు. వచ్చే జనవరిలోపు తీహార్ జైలుకెళ్లే వాళ్లు కూడా పోలవరం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎంత పూర్తయిందో.. దేశంలోని మిగతా జాతీయ ప్రాజెక్టులు ఎంత పూర్తి అయ్యాయో మీకు తెలియదా? అని ప్రశ్నించారు. దేశంలో ఉన్న జాతీయ ప్రాజెక్టుల పని తీరు గురించి కేవీపీ.. కేసీఆర్, మోదీలకు ఉత్తరాలు రాయాలని కోరారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకోవడం లేదని మోదీ అంటున్నారని.. కేసీఆర్, మోదీ ప్రేమించుకోవటం వల్లే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, అంతేగానీ తామంతా ఒకటిగానే ఉన్నామని తెలిపారు. జనం తనను మరచిపోతారనే భయంతో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఒక్కోసారి తన ఉనికిని చాటుకునేందుకు తహతహ లాడతారని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ గతంలో వైఎస్‌కు ఆత్మగా.. ఇప్పుడు జగన్‌కు ప్రేతాత్మ.. కేసీఆర్ అంతరాత్మగా కేవీపీ పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీకి ఆయన తలలో నాలుకగా ఉంటున్నారని విమర్శించారు. విభజన చట్టంలో ఏ అంశాలనూ చంద్రబాబు సాధించలేదనడం హాస్యాస్పదమన్నారు. కమీషన్ల కోసం మట్టిపనులు చేసి దోచుకున్న చరిత్ర కలిగిన కేవీపీకి పోలవరం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన కేవీపీ రాష్ట్ర ప్రయోజనాలను మరోసారి తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడిగా ఆనాడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పార్లమెంట్లో వౌనం వహించిన కేవీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. పోలవరం నిధులు విడుదల కాకుండా లేఖలు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో జరిగిన జాప్యంపై ఎందుకు నోరుమెదపరని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి శకునిపాత్ర పోషిస్తున్న కేవీపీ సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిన చరిత్రను గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ది ఉంటే ప్రధాని మోదీని నిలదీయాలని సవాల్ విసిరారు.