చంద్రబాబుని సాధించాలి అంటే వాళ్లకు ఉన్న ఒకే ఒక పిల్ల కేసు ఓటుకి నోటు కేసు. అయితే ఇది తెలంగాణా ఏసిబి నుంచి, ఎప్పుడు ఈడీ చేతిలోకి వెళ్లిందో కాని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, ఇప్పుడు మరోసారి ఈడీని రంగంలోకి దించారు. కోడి కత్తి కేసు పై ఎన్ఐఏ చేతులు ఎత్తేయటంతో, ఇప్పుడు ఈ కేసు పట్టుకుని చంద్రబాబుని ఎలా అయినా దీంట్లో దోషిగా చూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో నిన్న రేవంత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కేసీఆర్ భుజాలపై తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చాలని మోదీ చూస్తున్నారు. ఈడీ అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కేసీఆర్, మోదీ ఒత్తిడితో ఈడీ అధికారులు పనిచేస్తున్నారు. కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోంది. చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ విచారణ ఉంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హైకోర్టు కొట్టేసిన కేసును తిరగదోడుతున్నారు. మంగళవారం నుంచి అడిగిన ప్రశ్నలే అడిగి వేధిస్తున్నారు.’’ అని అన్నారు. ఈడీ అధికారుల గురి అంతా ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపైనే ఉందని, ఆయన్ని లక్ష్యంగా చేసుకుని తనను వేధిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్, మోదీలు కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, హైకోర్టు తీర్పులకు భిన్నంగా ఈడీని ఉసిగొల్పారని ధ్వజమెత్తారు. అడిగిన ప్రశ్నలనే తిరిగి అడుగుతూ ఈడీ అధికారులు తనను వేధింపులకు గురి చేశారన్నారు. విచారణ ముగిశాక రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబును ఈ కేసులో ఇరికించే లక్ష్యంతో ఈడీ అధికారుల ప్రశ్నలున్నాయి. కేసులు పెట్టడం ద్వారా నన్ను వేధించాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇప్పటికే నాపై 66 కేసులున్నాయి. అందులో ఇదొకటి. ఇవేవీ న్యాయస్థానాల్లో నిలబడవు. ఇది రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. కేసుల విచారణకు సహకరిస్తూనే కేసీఆర్‌పై పోరాటం కొనసాగిస్తా. పార్లమెంటు ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా’ అని పేర్కొన్నారు.