ఐటీ గ్రిడ్’ కంపెనీ వ్యవహారం తెలుగురాష్ట్రాలను ఓ కుదుపు కుదుపుతోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయిందంటూ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ కంపెనీ ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ విషయంలో న్యాయపరంగా ఏ రకంగా ముందుకెళ్లాలన్న విషయమై వీరిద్దరూ చర్చించనున్నారు. మరోవైపు లోకేశ్వర్ రెడ్డిని విచారించేందుకు కూకట్ పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులను తెలంగాణ పోలీస్ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అనంతరం లోకేశ్ రెడ్డిని అధికారులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
‘ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసుతో తెలంగాణ పోలీసులకు సంబంధం ఏంటి?’ అని టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నాయి. ‘విశాఖలోని బ్లూఫ్రాగ్ అనే కంపెనీ నుంచి మన ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని హైదరాబాద్‌లో ఉన్న ఐటీగ్రిడ్ సంస్థ తస్కరించిందని గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపైనే తాజాగా లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి కూడా హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. ఇది మన సమాచారానికి సంబంధించిన కేసు కాబట్టి, ఇక్కడకు బదిలీ చేయాలి. విశాఖలోని బ్లూఫ్రాగ్ కంపెనీ నుంచి సమాచారం తస్కరించిందని ఫిర్యాదు చేసినందున.. తప్పు జరిగిన ప్రదేశం విశాఖగా భావించి అక్కడికి కేసు బదిలీ చేయాలి. అలాకాకుండా దురుద్దేశంతో తెలంగాణ పోలీసులు అర్ధరాత్రి కంపెనీలో సోదాలు చేయడం, తర్వాత నలుగురు ఉద్యోగుల్ని తీసుకెళ్లిపోవడం ఏమిటి?’ అని ప్రశ్నిస్తున్నాయి.
ఆ సమాచారం మొత్తాన్ని వైసీపీకి అందించేందుకే తెలంగాణ పోలీసులు ఈ రకంగా వ్యవహరించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ‘ఇటీవల జయరాం చౌదరి హత్య జరిగింది. అతని మృతదేహం కంచికచర్ల సమీపంలో ఉండడంతో ఇక్కడ కేసు నమోదు చేశారు. కానీ హత్య జరిగింది హైదరాబాద్‌లో అని తెలియడంతో కేసు తెలంగాణకు బదిలీ చేశాం. ఇప్పుడు బ్లూఫ్రాగ్ కంపెనీ కేసును మనకు బదిలీ చేయాలి’ అని అంటున్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ప్రైవేటు కంపెనీ వద్ద ఉందా? ఎలా ఉంది? తెలంగాణ పోలీసుల పాత్ర తదితర అంశాలపై చర్చ జరిగిందని సమాచారం.