కర్నూలు జిల్లా రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులైన కోట్ల, కేఈ కుటుంబాలు దశాబ్దాల విభేదాలు మరచి ఎట్టకేలకు ఒకే పార్టీలోకి వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాత శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు రాజకీయంగా ఆయువుపట్టు లాంటి డోన్ నియోజకవర్గాన్ని కోట్ల వర్గం కోరుతుందన్న ఆందోళనతో కోట్ల తెదేపాలోకి రావడాన్ని కేఈ వర్గం తొలుత స్వాగతించలేదు. దీనిపై కేఈ కృష్ణమూర్తి కొన్ని రోజుల క్రితం తన సోదరులు, కుమారుడితో వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. డోన్, పత్తికొండ నియోజవకర్గాల విషయంలో హామీ లభించాకే.. కోట్ల రాకపై తమకు అభ్యంతరం లేదని కేఈ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో డోన్ నుంచి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్, పత్తికొండ నుంచి కేఈ కుమారుడు శ్యాంబాబు పోటీ చేయాలన్నది వారి ఆలోచన.
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తండ్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాదన్నల హయాం నుంచీ ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. 1994 శాసనసభ ఎన్నికల నాటికి విజయభాస్కర్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. విజయభాస్కర్‌రెడ్డి డోన్ నుంచి పోటీ చేయగా, కేఈ కృష్ణమూర్తి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పీవీ నరసింహారావు జోక్యం చేసుకుని, కేఈతో నామినేషన్ ఉపసంహరింపజేసి.. కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కోట్ల గెలవగా, కేఈ ఓడిపోయారు. తర్వాత కేఈ వర్గం తెదేపాలో చేరింది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలులో తెదేపా నుంచి పోటీ చేసిన కేఈ కృష్ణమూర్తిని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఓడించారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో కోట్లపై కేఈ గెలిచారు. 2004 సార్వత్రికఎన్నికల్లో కర్నూలు లోక్‌సభస్థానంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి చేతిలో కేఈ కృష్ణమూర్తి, డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్ల సుజాత చేతిలో కేఈ ప్రభాకర్ ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో డోన్‌లో కోట్ల సుజాతను కేఈ కృష్ణమూర్తి ఓడించారు.
వ్యూహాత్మకంగానే ముందుకు.. కర్నూలు జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలుండగా గత ఎన్నికల్లో తెదేపా మూడు శాసనసభ స్థానాల్లోనే గెలిచింది. మిగిలిన అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లోనూ ఓడిపోయింది. దీంతో జిల్లాలో పార్టీ బలోపేతంపై తెదేపా నాయకత్వం దృష్టి సారించింది. కర్నూలు, నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, కోడుమూరుల్లో వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు. నంద్యాల, కర్నూలు ఎంపీలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక కూడా అధికార పార్టీలోకి వచ్చేశారు. ఇప్పుడు జిల్లాలో బలమైన వర్గం కలిగిన కోట్ల కుటుంబం కూడా తెదేపాలో చేరడంతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతమైంది.