తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా రేగిన వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఐటీ గ్రిడ్ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులను తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 కల్లా వారిని తమ ముందుకు తీసుకురావాలంది. కేసు డైరీలో ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకోవడం చూస్తుంటే ఉద్యోగులను అక్రమంగానే అదుపులోకి తీసుకున్నారని స్పష్టమవుతోందని పేర్కొంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీగ్రిడ్ అనే కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగుల్ని తెలంగాణ పోలీసులు తీసుకెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తమ సహచర ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ కంపెనీ డైరక్టర్ అశోక్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్‌గౌడ్ అనే నలుగురు ఉద్యోగుల ఇళ్లల్లోకి తెలంగాణ పోలీసులు బలవంతంగా చొరబడి నిర్బంధంలోకి తీసుకున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
భాస్కర్‌తోపాటు ఆయన భార్య ఫోన్ కూడా లాగేసుకున్నారన్నారు. అడిగితే తాము ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పోలీసులు దురుసుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఫణీంద్ర తండ్రి అప్పన్నదొరను నిర్బందించి.. మీ కుమారుడు వస్తేనే వదులుతామని బెదిరించారని వివరించారు. ఈ పిటిషన్‌ను ఆదివారం హైకోర్టు హౌస్ మోషన్‌లో విచారించింది. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ డీజీపీ, సైబర్‌క్రైం వింగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, మాదాపూర్ పోలీ్‌సస్టేషన్ ఇన్‌స్పెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. మొదటగా పిటిషనర్ తరపు న్యాయవాది జి.సుబ్బారావు వాదనలు వినిపిసూ నలుగురు ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులను వారి ఇళ్ల నుంచి మాదాపూర్ పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారని తెలిపారు.
దీంతో ఆ నలుగురిని ఎందుకు అరెస్టు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. మీకు కంపెనీపై ఫిర్యాదు వచ్చిందన్నారు. అలాంటప్పుడు కంపెనీ ఉద్యోగులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించింది. నలుగురు ఉద్యోగులకు సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశామని, వాళ్లను నిందితులని అరెస్టు చేయలేదని, సాక్షులుగా తీసుకెళ్లామని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. సాక్షులుగా అయితే నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎలా అరెస్ట్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కేసు రికార్డులు ఏమున్నాయని అడగ్గా.. అన్నీ ఉన్నాయంటూ రికార్డులను తెలంగాణ పోలీసులు అందించారు. అందులో తెల్లకాగితాలపై సంతకాలు ఉండడం చూసి ఇవేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. పంచనామా కోసం వీఆర్‌వో సంతకం తీసుకున్నామని తెలంగాణ పోలీసులు బదులిచ్చారు. ‘పంచనామా నివేదిక రాసి సంతకాలు పెట్టిస్తారా? లేకుంటే సంతకాలు పెట్టించుకుని.. ఏదైనా రాసుకుంటారా?’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి ఇల్లు లేదా సంస్థలో సోదాలు నిర్వహించి పంచనామా పూర్తయిన తర్వాత ఆయా విషయాలు అందులో పొందుపర్చి.. అక్కడే స్థానిక వీఆర్వో సంతకం తీసకుంటారు. మీరు తెల్లకాగితాలపై సంతకాలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇది చూస్తేనే మీ ఉద్దేశం అర్థమవుతోంది. వెంటనే అరెస్ట్ చేసిన నలుగురు ఐటీగ్రిడ్ ఉద్యోగులను సోమవారం కోర్టు ముందు ప్రవేశపెట్టాలి అని ఆదేశించింది.