తన ఫాన్స్ ని ఎదో రంజింపచెయ్యటానికి, ఎదో ఎచ్చు కోసం మాట్లాడిన మాటలు, ఇప్పుడు పవన్ మెడకు చుట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, ప్రతి విషయం మాట్లాడుతూ, నాకు ముందే తెలుసు, నాకు వాళ్ళు చెప్పారు, నాకు వీళ్ళు చెప్పారు అని పవన్ కళ్యాణ్ అంటూ ఉండటం మనం చూసాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పై పవన్ మాట్లాడిన మాటలు, ఇప్పుడు పాకిస్తాన్ మీడియాకి ఆయుధం అయ్యింది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు ముందు పాక్‌తో యుద్ధం జరుగుతుందని బీజేపీ తనకు రెండేళ్ళ కిందటే చెప్పినట్లు సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థ "డాన్" తన వెబ్‌సైట్‌లో ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి క్లుప్తంగా సమాచారం ఇస్తూ మనదేశానికి చెందిన ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని లింక్ చేసింది.
పవన్ వ్యాఖ్యలు ఇవేనంటూ డాన్ వెబ్‌సైట్ వాటిని ప్రత్యేకంగా హైలైట్ చేసింది... "యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ళ కిందటే చెప్పారు. దీన్ని బట్టి మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందన్నది అర్థం చేసుకోవచ్చు"... జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్... కడప జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు డాన్ వెబ్‌సైట్ లింక్ చేసిన భారతీయ మూల ఇంగ్లీష్ వెబ్‌సైట్ కథనం పేర్కొంది. అంతేగాక పవన్ కల్యాణ్‌కు గతంలో బీజేపీతో సంబంధాలున్నాయని కూడా తెలిపింది. బీజేపీ నేతలు మాత్రమే దేశభక్తులన్నట్లుగా చెప్పుకుంటున్నారని, దేశభక్తి కేవలం బీజేపీ హక్కు కాదని, వారికంటే తాము 10 రెట్లు దేశభక్తులమని పవన్ పేర్కొన్నట్లు ఆ కథనం వెల్లడించింది. భారత్‌లోని ముస్లింలు వారి దేశభక్తిని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదంటూ సమాజంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు జరిగే ప్రయత్నాలను విఫలం చెయ్యాల్సిందిగా జనసేన కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చినట్లు ఈ కథనం తెలిపింది.
"భారతదేశంలో ముస్లింలకు సమాన హక్కులున్నాయి. పాకిస్తాన్‌లో హిందువుల స్థితి ఏమిటో నాకు తెలియదు కానీ, భారత్ మాత్రం ఎప్పుడూ ముస్లింలను అక్కున చేర్చుకుని ఆదరిస్తూనే ఉంది. అందువల్లే అజహరుద్దీన్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయ్యారు, అబ్దుల్ కలాం ఈ దేశ రాష్ట్రపతి అయ్యారు" అని పవన్ తన ప్రసంగంలో చెప్పినట్లు ఈ కథనం తెలియజేసింది. ఇదిలా ఉంటే, ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా పవన్ చేసిన వ్యాఖ్యల గురించి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించారు. యుద్ధం పేరుతో బీజేపీ చివరి క్షణంలో జిమ్మిక్కులు చేస్తుందని కొద్ది నెలల క్రితమే తాను హెచ్చరించానంటూ తాను చెప్పిన విషయాన్నే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ధృవపరిచారన్నారు. అయితే మొన్న చంద్రబాబు పై విష ప్రచారం చేస్తూ, అనని మాటలు, అన్నట్టు, "ఇమ్రాన ఖాన్ ఆధారాలు అడుగుతున్నారు చూపించండి" అంటూ మోడీని ప్రశ్నించినట్టు, బీజేపీ చేసిన విష ప్రచారానికి, జనసేన, వైసీపీ చేసిన హంగామా తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇలాంటివే వాళ్లకు ఎదురైంది.