కనిగిరి మాజీ శాసనసభ్యుడు, ఉగ్రసేన అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం తెలుగుదేశంలో చేరనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి అందిన సమాచారం మేరకు నియోజకవర్గంలోని వేలాదిమంది అనుచరగణంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారు. తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయ సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి కనిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన అనంతరం కూడా ఆ పార్టీలోనే కొనసాగారు. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆరేడు మాసాల క్రితం ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రె్‌సకు దూరమయ్యారు.
ఉగ్రసేన పేరుతో కనిగిరి నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. కొంతకాలంగా టీడీపీకి దగ్గరయ్యారు. ఉగ్ర సేవా కార్యక్రమాలను, రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్న తీరును గమనించిన చంద్రబాబు గత మూడు నెలలుగా ఆయనను ప్రోత్సహిస్తున్నారు. డాక్టర్ ఉగ్ర సిఫార్సుల మేరకు సీఎం సహాయనిధిని మంజూరు చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఉగ్రనరసింహారెడ్డిలతో ముఖ్యమంత్రి మాట్లాడి ఒకరు ఎమ్మెల్యేగా పోటీచేస్తే మరొకరికి ఎమ్మెల్సీ ఇస్తానని ప్రతిపాదించారు. రెండు రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పార్టీశ్రేణులు, సాధారణ ప్రజల నుంచి మద్దతు లభించినట్లు తెలిసింది.
దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి వెంటనే ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరమని సూచించారు. తాను తన అభిమానులు, అనుచరులతో కలిసి చేరతానని ఉగ్ర తెలిపారు. అందుకు అనుగుణంగా తాడేపల్లి సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. కాగా గురువారం మధ్నాహ్నం నుంచి నియోజకవర్గంలోని అనుచరులు, అభిమానులు కార్యక్రమానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇతర ప్రాంతాలలో ఉన్నవారు కూడా హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా డాక్టర్ ఉగ్ర ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు ఫోన్ చేసి కార్యక్రమాన్ని తెలియజేసి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అలాగే నియోజవర్గంలో టీడీపీ ముఖ్యనాయకులకు ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు.