కృష్ణా జిల్లాలో అధికశాతం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల బరిలో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. 16 అసెంబ్లీ స్థానాలకు గానూ, పదింటిని అధినేత ఖరారు చేశారు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. మరోవైపు టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీలో అభ్యర్థుల ఖరారుపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరు ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారో అనే దానిపై ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులుగా ఉన్న వారిలోనూ స్పష్టత కరువైంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ అలముకుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైసీపీ పెద్దలు తమ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడం లక్ష్యంగా చేసుకున్నారు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారానికి పూనుకున్నారు. జిల్లాలో మైలవరం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి దేవినేని ఉమా పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ నేతలు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.
ఓటర్లను ప్రలోభ పెట్టడంతోపాటు సోషల్ మీడియా వేదికగా మంత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారు. గురువారం మంత్రి ఉమా జి.కొండూరులో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే వాట్సప్‌లో ‘టీడీపీ నేతల పట్ల మంత్రి ఉమా చులకన వైఖరి..’ అంటూ మెసేజ్‌లు హల్‌చల్ చేయడం ప్రారంభించాయి. మైలవరం ఏఎంసీ చైర్మన్ ఉయ్యూరు వెంకటనరసింహారావు పట్ల మంత్రి చులకనగా మాట్లాడటంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి అలాంటిదేమీ జరగలేదని సాక్షాత్తూ వెంకట నరసింహారావు ఖండించారు. టీడీపీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టించేందుకు వైసీపీ నాయకులు ఇలాంటి మెసేజ్‌లను ప్రచారంలోకి తీసుకొస్తున్నారని నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నారంటూ వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందేశాలను ప్రచారంలోకి తెచ్చారు. వీటిపై స్పందించిన ఎమ్మెల్యే వంశీ.. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం గన్నవరం టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో అయోమయం సృష్టించడానికే వైసీపీ శ్రేణులు ఇలాంటి సందేశాలను వ్యాప్తి చేస్తున్నాయన్నారు.
గుడివాడలోనూ ఇదే తరహా ప్రచారం నడుస్తోంది. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున కొడాలి నాని బరిలోకి దిగనున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలో దిగవచ్చని భావిస్తున్నారు. దీంతో స్థానిక, స్థానికేతర అభ్యర్థుల నడుమ పోటీ అంటూ సామాజిక మాధ్యమాల్లో స్థానికతను రెచ్చగొట్టేలా వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ బలంగా ఉన్న మైలవరం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో టీడీపీ అనుకూల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈ నియోజకవర్గాల్లోని తమ పార్టీ కార్యకర్తల ద్వారా టీడీపీ అనుకూల ఓటర్ల ఓట్లను తొలగించా లంటూ ఫారం -7 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయిస్తున్నారు. టీడీపీ అనుకూల ఓటర్ల జాబి తాను దగ్గర పెట్టుకుని పెద్దఎత్తున ఫారం-7లను నింపి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. ఈ విషయమై టీడీపీ నాయకులు అప్రమత్తమై ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్నికల సంఘం గురువారం ఓ ప్రకటన విడుదల చేసి అప్రమత్తం చేసింది.