గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ ఎవరికిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో కార్యకర్తల్లో టెన్షన్ తారాస్థాయికి చేరింది. ప్రజల్లో సైతం ఎక్కడ చూసినా దీనిపై చర్చ జరుగుతోంది. నాలుగున్నరేళ్లుగా పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న రావి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇచ్చే విషయాన్ని అధిష్ఠానం తేల్చలేదు. మొత్తంగా టీడీపీ టికెట్ రేసు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. టికెట్ రేసులో రావి వెంకటేశ్వరరావుతోపాటు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకూ స్థానికులనే ఆదరించిన గుడివాడ ఓటర్లు స్థానికేతరులకు ఇస్తే ఎలా స్పందిస్తారోనని టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.
టికెట్ ఖరారులో అనుసరిస్తున్న సాచివేత ధోరణితో టీడీపీలో ఏర్పడిన సందిగ్ధతను ఎమ్మెల్యే కొడాలి నాని సొమ్ము చేసుకోవడంలో విజయ వంతమవుతున్నారు. పలువురు గ్రామస్థాయి టీడీపీ నాయకులను వైసీపీలో చేర్చుకుంటూ హడావిడి చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టించేందుకు నాని చేరికల డ్రామాలకు తెర లేపుతున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. చిన్న అవకాశం వచ్చినా గెలుపు బాట వేసుకునే ఎమ్మెల్యే నానిని ఎదుర్కోవాలంటే టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. టీడీపీ మీనమేషాలు లెక్కిస్తుండం ప్రత్యర్థి బలం పుంజుకోవడానికి దోహదపడుతుందని స్థానిక నేతలు పేర్కొంటున్నారు.
ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావుకు గత ఎన్నికల సమయంలోనే సీఎం చంద్రబాబు 2019లోనూ టికెట్ ఇస్తాననే హామీ ఇచ్చిన విషయాన్ని రావి అనుచరులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు అవినాష్ అనుచరులు ఈసారి గుడివాడ టికెట్ తమదేనన్న ధీమాతో ఉన్నారని సమాచారం. టీడీపీ అధిష్ఠానం వారం నుంచి నియోజకవర్గంలో వివిధ రూపాల్లో సర్వేలు నిర్వహిస్తోంది. వీటి ఆధారంగా టికెట్ ఖరారు చేస్తారని పార్టీ ముఖ్యులు స్పష్టం చేస్తున్నారు. నెలాఖరులోపు అభ్యర్థిత్వంపై స్పష్టత ఇచ్చే దిశగా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. అయితే నానిని ఓడించటానికి అన్ని విధాలుగా రేడీగా ఉన్నామని, అభ్యర్ది పై క్లారిటీ ఇవ్వమని, తెలుగుదేశం క్యాడర్ అంటుంది.