ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో టీడీపీ వంద శాతం ఓడిపోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి కె.తారకరామారావు అన్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం పలువురు ముఖ్యనేతలకు టీడీపీ కండువా కప్పిన అనంతరం ఆయన మాట్లాడారు. జగన్ సీఎం అవుతాడని కేటీఆర్ అంటున్నారని, మోదీ, కేసీఆర్, జగన్ కుట్రలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవని ఆయన హెచ్చరించారు. వాళ్లకు చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. రాజధానిలో అభివృద్ధి ఏమీ లేదు.. అంతా గ్రాఫిక్స్ అంటున్నారని, ముందు గ్రాఫిక్స్ వచ్చిన తర్వాతే భవనాలు వస్తాయని చంద్రబాబు గుర్తు చేశారు.
ఏపీని ప్రశాంత్ కిషోర్ మరో బిహార్ చేయాలని చూస్తున్నారని, జగన్, పీకే కుప్పిగంతులు తన దగ్గర పనిచేయవని ఆయన అన్నారు. "ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్, మోదీ కుట్ర పన్నుతున్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని మోదీని నిలదీశాను. చీకటి రాజకీయాలు చేయొద్దు.. తెలుగువారి సత్తా ఏంటో చూపిస్తాం. వచ్చే ఎన్నికల్లో మనం 25 ఎంపీ సీట్లు గెలవాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. రూ. 10 కోట్లు ఎక్కువ ఇస్తానంటే వాళ్లకే జగన్ టికెట్ ఇస్తారు. రాష్ట్రం కోసం, భావి తరాల భవిష్యత్ కోసం నేను పోరాడుతున్నాను. వచ్చే ఎన్నికల్లో సమర్థులైనవారిని ఎంపిక చేస్తున్నాం" అని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా, శనివారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో టీడీపీ వంద శాతం ఓడిపోతుందని అన్నారు. అలాగే ఏపీకి కాబోయే సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పారు. ఏపీలో వైసీపీ గెలుస్తుందని తనకు నమ్మకం ఉందని, జగన్‌కు మద్దతిచ్చేందుకు తాము ఏపీకి పోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్‌లో వైసీపీకి స్థానం కల్పిస్తామని, ఇప్పటికే చర్చలు జరిపామని వెల్లడించారు. కేసీఆర్ స్వయంగా వెళ్లి జగన్‌తో భేటీ అయ్యే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కలవాల్సిన సమయంలో జగన్‌ను కలుస్తారని వ్యాఖ్యానించారు. బాబు కలలో కూడా కేసీఆర్ పేరునే కలవరిస్తున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం, ఇతర పార్టీ వాళ్లపై ఏడవకుండా.. ఐదేళ్లలో తానేం చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలని సూచించారు.