వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఒక్కొక్కరికి ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ నుంచి పిలుపు వస్తోంది. హైదరాబాద్ వచ్చి తనను కలవాలంటూ సమన్వయకర్తలను ఆయన ఆదేశిస్తున్నట్టు తెలిసింది. జిల్లాలో 12 మంది సమన్వయకర్తలకు గత నాలుగు రోజుల్లో కబురు అందగా, శనివారం మరో ముగ్గురు సమన్వయకర్తలు హైదరాబాద్ వెళ్లి ప్రశాంత్‌కిషోర్‌ను కలిశారు. ఒక్కొక్కరితో వేర్వేరుగా అర్ధగంట సేపు ప్రశాంత్‌కిషోర్ మాట్లాడినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో తమ బృందం ఇప్పటివరకూ నాలుగుసార్లు చేపట్టిన సర్వే వివరాలను వారి ముందు పెట్టి తాజా పరిస్థితిని కూడా వివరించినట్టు తెలిసింది. ఈ భేటీ తర్వాత తమకు టిక్కెట్ వస్తుందో రాదో కూడా సమన్వయకర్తలకు అవగాహన వచ్చేస్తోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఎన్నికలు దగ్గరపడడంతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా పనిచేస్తున్న వారి సమర్థత, ప్రజల్లో వున్న పట్టు, ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే పరిస్థితి ఏమిటి? అనేదానిపై పార్టీ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ (పీకే) సారథ్యంలో పలుమార్లు సర్వే నిర్వహించారు. సర్వే నివేదికల ఆధారంగా పలుచోట్ల సమన్వయకర్తల మార్పు, ఎన్నికల నిర్వహణపై తరగతులు, ప్రజలకు దగ్గరయ్యేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా గత మూడు నెలల కాలంలో రెండుసార్లు సర్వే చేయించారు. మరో వారం, పది రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి వుండడంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో పీకే వ్యక్తిగతంగా భేటీ అవడం ప్రారంభించారు. అందులో భాగంగా విశాఖ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల్లో 12 మందిని పీకే హైదరాబాద్ పిలిపించుకుని ఇప్పటికే భేటీ అయ్యారు.
తాజాగా దక్షిణ, ఉత్తర, గాజువాక నియోజకవర్గాల సమన్వయకర్తలను హైదరాబాద్ రావాలని వర్తమానం పంపించడంతో వారంతా శుక్రవారమే బయలుదేరి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం ముగ్గురితో వేర్వేరుగా అర గంట సేపు పీకే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిలో లోపాలు, ఒకవేళ టిక్కెట్ ఇస్తే గెలుపొందేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్థానికంగా ఎవరెవరిని కలుపుకుపోవాలి...వంటి సూచనలు, సలహాలతో కూడిన కాగితాన్ని వారి చేతిలో పెట్టినట్టు తెలిసింది. సమన్వయకర్తలనే కాకుండా గతంలో సమన్వయకర్తలుగా పనిచేసిన వారిని, ప్రస్తుతం టిక్కెట్ ఆశిస్తున్న వారిని, పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న నేతలను కూడా ఇప్పటికే హైదరాబాద్ పిలిపించి పీకే మాట్లాడినట్టు తెలిసింది.