ఎన్నికల సంఘం చేసే కొన్ని పనులు బలమైన రాజకీయ పార్టీలకు తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. ఇందుకు చాలా ఉదంతాలు నిదర్శనంగా నిలిచాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు ఓ సాధారణ పార్టీకి కేటాయించడంతో చాలా చోట్ల గులాబీ అభ్యర్థులకు తక్కువ ఓట్లు పడ్డాయని టీఆర్ఎస్ చెప్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీ ఎన్నికల్లోనూ పునరావృతం కానుందని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీనికి కారణం, కేఏపాల్, ప్రజాశాంతి పార్టీ. ఎన్నో యుద్ధాలు ఆపి, భారత్, పాక్ యుద్ధాన్ని నిలువరించేందుకు ఆయా దేశాల అద్యక్షులతో సంప్రదింపుల కార్యక్రమంలో ఉన్నారు. అదే సమయంలో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని క్రుత నిశ్చయంతో ఉన్నారు.
దీని కోసం ఇప్పటికే ట్రంప్ సహాయం తీసుకున్నారు పాల్. ఇప్పటికే రోజు లైవ్ లు ఇస్తున్న పాల్, రేపోమాపో ఆయన కూడా ఏపీలో ప్రచారంలో మొదులు పెట్టనున్నారు. ఎన్నికలకు రెడీ అవుతున్న పాల్ పార్టీ ప్రజాశాంతి పార్టీకు ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. అదీ హెలికాప్టర్. దీన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లాలంటూ ప్రతి రోజు పాల్ ఊదరగొడుతున్నారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. హెలికాప్టర్ గుర్తులో ఎక్కువగా కనిపించేది పైన తిరిగే రెక్కలే. ఇప్పుడు అవే రెక్కలు, జగన్ వర్గాన్ని గుబులు పుట్టిస్తున్నాయట. వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. ప్రజాశాంతి పార్టీది హెలికాప్టర్. చదువుకున్న వారికి ఇది తేలికగా అర్ధమవుతుంది.
కానీ గ్రామీణ ప్రాంతప్రజలు, వృద్ధులకు రెండింటి మధ్య తేడా గుర్తించటం కష్టమే. అదే వైసీపి శ్రేణులకు అసలు బెంగగా పరిణమించింది. రాబోయే ఎన్నికల్లో పార్టీను గట్టెక్కించేది గ్రామీణ ఓటర్లు, అభిమానులే అనేంత భరోసా వైసీపీలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిపడిన హెలికాప్టర్ గుర్తు తమ ఓట్లను ఎక్కడ చీల్చుతుందనే బెంగ పట్టుకుందట. పైగా పాల్.. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానంటున్నారు. ఏమౌతుందిలే అని తేలికగా కొట్టిపారేద్దామంటే, ముందస్తు ఎన్నికల్లో గులాబీపార్టీ చవిచూసిన అనుభవం కళ్ల ముందు తిరుగుతోంది. ఇప్పుడు ఇదే పరిణామం తిరిగి ఏపీలో హెలికాప్టర్, ఫ్యాన్ గుర్తుల మధ్య పునరావృతమైతే, మూడు పార్టీలు పొతే పడే చోట, కొన్ని ఓట్లు అటూ ఇటూ పడినా, ఇబ్బంది అయిపోతుంది.