నిన్న రాజమండ్రిలో అమిత్ షా మాట్లాడిన మాటలకు, అమిత్ షా కి కొత్త పేరు పెట్టారు చంద్రబాబు. అమిత్ షా కాదు.. అతనో అబద్ధాల షా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానుద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమిత్ షా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఏపీకి 90శాతం చేసేసినట్టుగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. అలాగే తప్పు చేశామన్న పశ్చాత్తాపం బీజేపీ నేతల్లో లేదని, ‘ఇంకా రెచ్చగొడుతున్నారు.. బాధపెడుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చ జరగాలన్నారు.
రావాల్సిన లక్ష కోట్ల రూపాయలు వచ్చి ఉంటే ఎంతో ముందుకు పోయేవాళ్లమని సీఎం అన్నారు. దేశంలో మనం కూడా భాగమైనప్పుడు మనమెందుకు బాధ పడాలని సూటిగా ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఎవరు మనకి మద్దతు తెలుపుతారో వారే మనకి మిత్రులుగా ఉంటారని స్పష్టంచేశారు. 4 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేశామని నేతలకు సీఎం తెలిపారు. క్షుణ్ణంగా అధ్యయనం చేసే సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన నేతలకు వివరించారు. హవాలా సొమ్ములు తెచ్చేందుకే జగన్ విదేశీ పర్యటన చేస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. జగన్ లండన్ పర్యటనపై సీఎం స్పందిస్తూ.. డబ్బుల కోసమే జగన్ లండనశ్రీ్ పర్యటన అని విమర్శించారు. ఎన్నికల ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని, జగన్ ఎందుకు వెళుతున్నారు? అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేసీఆర్కు అసూయ, ద్వేషం అని చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంపై మోదీ, అమిత్ షా కక్షగట్టారన్నారు. అలాగే కేసుల మాఫీ కోసం బీజేపీతో, డబ్బుల కోసం కేసీఆర్తో జగన్ లాలూచీ పడ్డారన్నారు. కుట్రలు, కుతంత్రాల జోడీ బీజేపీ, వైసీపీ అని చంద్రబాబు అన్నారు. అలాగే ఉగ్రదాడులపై గతంలో సీఎంగా మోదీ వ్యాఖ్యలనే ప్రస్తావించామని, మన్మోహన్పై మోదీ ఏం మాట్లాడారో అదే గుర్తు చేశామని చంద్రబాబు అన్నారు. దీనిపై బీజేపీ నేతల రాద్ధాంతం అనవసరమని, టీడీపీ చేసింది మోసం కాదు.. బీజేపీ చేసింది నమ్మకద్రోహమని సీఎం అన్నారు. ఎవరు దేశానికి ద్రోహం చేశారో ప్రజలే తేలుస్తారని చంద్రబాబు అన్నారు.