హైదరాబాద్ లోని మాదాపూర్ లో ‘ఐటీ గ్రిడ్’ కంపెనీ వ్యవహారం ఏపీ-తెలంగాణ పోలీసుల మధ్య వివాదం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే తన సహోద్యోగులు నలుగురు కనిపించడం లేదని కంపెనీకి చెందిన అశోక్ అనే ఉద్యోగి తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బయలుదేరారు. ఈ ఫిర్యాదు వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు ఏపీ పోలీసులు కూకట్ పల్లిలోని ఫార్చ్యూన్ ఫీల్డ్స్ లో ఉన్న లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
లోకేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు, వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. జరుగుతున్న తతంగాన్ని వీడియో తీసి ఉన్నతాధికారులకు చేరవేద్దామంటే సెల్‌ఫోన్లు పగులకొడతామని, తెలంగాణా పోలీసులని ముందుంచి, వైసీపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారని, ఏపీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కాగా పోలీసులను ముందుపెట్టి తెరవెనుక ముగ్గురు కలిసి కుట్ర పన్నుతున్నారని టీడీపీ చెబుతోంది. అయితే ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న మాదాపూర్ సైబర్ క్రైం పోలీసులు వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
భాస్కర్ కుటుంబ సభ్యులనూ మా బృందం కలవబోతోందని.. తెలంగాణ పోలీసుల అదుపులో భాస్కర్ ఉన్నట్టు మాకు సమాచారం లేదని ఏపీకి చెందిన ఎస్పీ విజయారావు చెబుతున్నారు. తాజా పరిణామాలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇది టీడీపీపై కుట్ర కాదని యావత్ ఆంధ్రప్రదేశ్‌పై జరుగుతున్న కుట్ర అని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ పారదర్శకంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఆన్‌లైన్‌లో పెడతామని, ప్రతి సమాచారం ఉంటుందని, రేషన్, పెన్షన్.. ఇలా ప్రతీది ఆన్‌లైన్‌లో ఉంటుందన్నారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీకి జనాధరణ లేదని.. అందుకే వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. డేటా అంతా ఏపీకి చెందిందని, తెలంగాణలో పిర్యాదు చేయడం ఏంటని ధూళిపాళ్ల ప్రశ్నించారు. ఓటర్లు, లబ్దిదారులు ఏపీలో ఉంటారని, దీనిపై విజయసాయిరెడ్డి తెలంగాణలో పిర్యాదు చేయడంపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని అని ధూళిపాళ్ల గుర్తు చేశారు.