టీడీపీ డేటాను దొంగిలించిన వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సమాచారాన్ని చోరీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందని, అది ఆదిలోనే గంగపాలైందని ఆయన అన్నారు. తెలుగుదేశంతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడలేదని, అలాగే ఆంధ్రప్రదేశ్‌తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని, టీడీపీ డేటా దొంగలు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ డేటా చోరీ విషయంలో సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారని, కానీ ఎక్కడో, ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందన్నారు.. , మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ సాక్ష్యాన్ని బయటపెడతానని వెల్లడించారు. ఈ మేరకు మీడియాను ఆహ్వానించానని అన్నారు.
ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇక ప్రచారం, రాష్ట్రవ్యాప్త ప్రచారం, బహిరంగ సభలపై దృష్టిని సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. టికెట్లు ఖరారైన అభ్యర్థులంతా విస్తృతంగా ప్రజల్లో తిరగాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 11,278 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి వున్నాయని, వాటి వసూలుకు అధికారులు కృషి చేస్తారని అన్నారు. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు, నరేంద్రమోదీకి ఓటేసినట్లేనని చంద్రబాబునాయుడు అన్నారు. ఫారం-7లో 95శాతం బోగస్ అని ఈసీ అధికారే చెప్పారన్నారు.
ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజలే అడ్డుకోవాలని, మా ఓట్లు తొలగించి మమ్మల్నే ఓటడుగుతారా..? అని... వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను ప్రజలంతా నిలదీయాలన్నారు. అంతేగాక మమ్మల్ని బతికుండగానే చంపేస్తారా అని ప్రశ్నించాలని, రేపు మా ఆస్తులు కూడా ఇలాగే గల్లంతు చేస్తారా..? అని... రేపు బూత్‌ల వద్ద ఓటర్లే వైసీపీని నిలదీయాలన్నారు. ఏపీ నీళ్లకు మోకాలడ్డే కేసీఆర్‌తో జగన్ దోస్తీ చేస్తున్నారని, సొంత ప్రాంతానికి నీళ్లిచ్చినా జగన్‌కు కంటిమంటేనని చంద్రబాబునాయుడు అన్నారు. నీళ్లు సముద్రంలో కలిసినా టీఆర్ఎస్‌కు ఇష్టమేనని, కానీ వృథాగా పోయే నీళ్లు వాడుకున్నా కేసీఆర్ ఓర్వలేకపోతున్నారన్నారు. ‘వాళ్లు కాళేశ్వరం కట్టుకోవచ్చు.. కానీ మనం ఏపీలో ప్రాజెక్టులు మాత్రం కట్టుకోకూడదు..’ అని అన్నారు. గోదావరి-పెన్నా అనుసందానానికి టీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తొందని, ఏపీ నదుల అనుసందానంపై దేశం మొత్తం ప్రశంసిస్తుండగా కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రం తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆంధ్రావాళ్లు ఊడిగం చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని చంద్రబాబు అన్నారు.