ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనను ప్రశ్నిస్తే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో, సీఎం చంద్రబాబు పాలనను పొగిడితే ఆదాయపు పన్ను (ఐటీ) శాఖతో దాడులు చేయిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. బోధన రుసుముల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సీఎం చంద్రబాబు చొరవను ప్రశంసిస్తూ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాల సంఘం (అపెక్మా) అధ్యక్షుడు ఎం.శాంతిరాముడు ప్రకటన విడుదల చేసిన అయిదు రోజులకే ఆయనపై ఐటీ దాడులు జరిగాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఏపీలో బోధన రుసుముల పథకం అమలవుతోందని లోకేష్ చెప్పారు.
2014లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టే వరకు రాష్ట్రంలో బోధన రుసుముల బకాయిలు రూ.5000 కోట్లు ఉండగా వీటిని చెల్లించడంతోపాటు ఏ ఏడాదికి ఆ ఏడాది ఇస్తూ వస్తున్నారని ఇటీవల అపెక్మా విడుదల చేసిన ప్రకటన పేర్కొందని వివరించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆందోళనకు దిగిన సీఎం రమేష్‌పై ఐటీ దాడులు చేశారని, ఏపీకి న్యాయం చేయాలని పార్లమెంటు వేదికగా ప్రశ్నించిన ఎంపీ గల్లా జయదేవ్‌కు ఈడీ నోటీసులు పంపారని తెలిపారు. ఏపీపై కేంద్రం కక్ష కట్టినట్లు వరస ఘటనలతో తేటతెల్లమవుతోందని లోకేశ్ వెల్లడించారు.