విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా దాసరి జైరమేష్... ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కాని, అసలు ఎవరూ ఈ మనిషి అని విజయవాడ అంతా ఆలోచిస్తుంది. ఎప్పుడో ఎన్టీఆర్ టైంలో ఈయన పార్టీకి ఫండింగ్ చేసారు. అప్పటి నుంచి నాదెండ్ల, దగ్గుబాటి లాగా, తెలుగుదేశం పార్టీ పెట్టింది నేనే అని చెప్పుకుంటూ ఉంటారు. పార్టీకి ఫండింగ్ ఇచ్చింది వాస్తవమే కాని, ఈయన ఎప్పుడూ ఫీల్డ్ లో తిరిగింది లేదు. సొంత క్యాడర్ లేదు. దాసరి బలవర్ధాన్ రావు అన్నగానే ఎక్కువ తెలుసు. అయితే, ఈయన దగ్గుబాటి దగ్గర స్నేహితుడిగా, చంద్రబాబు పై ఎప్పుడూ అసంతృప్తి వాదిగానే ఉండేవారు. 2014లో వంశీకి సీట్ ఇచ్చిన సమయంలో, దాసరి బలవర్ధాన్ రావుతో జరిగిన ఒప్పందం ప్రకారం, దాసరి జై రమేష్ కు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచరం జరిగింది.
అప్పటి నుంచి ఈయన అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఇక తన ఫ్రెండ్ దగ్గుబాటి జగన్ పంచన చేరి, చంద్రబాబుని సాదించటంతో, తాను కూడా అక్కడకి వెళ్లి చంద్రబాబుని సాదిద్దాం అనుకున్నారు. అందుకే జగన్ పక్కన చేరారు. ఈయన చంద్రబాబు సామాజికవర్గం, డబ్బు బాగా ఉండటంతో, జగన ఆయన్ను విజయవాడ ఎంపీగా నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే మొన్న జగన్ ను కలిసినప్పుడే, ఆయనను చాలా మంది చూసారు. అంతకు ముందు వరకు జై రమేష్ అనే పేరు వినటమే కాని, ప్రజలు ఆయనను చూసింది లేదు. పెద్ద తరం వారికి ఆయన తెలిసి ఉండవచ్చు కాని, రెండో తరంలో కొంత మందికి, మూడో తరంలో చాలా మందికి ఈయన ఎవరో కూడా తెలియదు.
అలాంటి ఈయన కేశినేని నాని పై పోటీ చేస్తారట..కేశినేని నాని పై, విజయవాడ ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. దీంతో వైసీపీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఈ సారి కూడా మళ్ళీ కేశినేని నాని గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున కోనేరు రాజేంద్ర ప్రసాద్, టీడీపీ తరుపున కేశినేని నాని పోటీ చేశారు. అయితే కేశినేని విజయం సాధించారు. దీంతో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కోనేరు రాజేంద్రప్రసాద్ దాదాపు రాజకీయాల్లో నుంచి తప్పుకున్నట్లే. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ గత ఎన్నికల్లో డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టారు. దాదాపు 80 నుంచి వంద కోట్ల వరకు ఖర్చు పెట్టారని ప్రచారం జరిగింది. ఇప్పుడు జై రమేష్ వంతు.. అప్పట్లోనే ప్రజలు కేశినేనిని నమ్మారు. ఇప్పుడు కేశినేనికి తాను చేసిన అభివృద్ధి కూడా తోడయ్యింది. ఇలాంటి ప్రత్యర్ధులతో ఇక కేశినేనికి ఎదురు లేనట్టే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.