తెలుగుదేశం పార్టీని దోషిగా చూపిద్దాం అనుకుని, ఇప్పుడు డేటా చౌర్యం రగడలో టీఆర్ఎస్ అడ్డంగా ఇరుక్కుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటా చోరీకి గురైందని సొంతంగా కేసు నమోదు చేసుకుని.. ఏకంగా ఆ ప్రభుత్వం పైన కేసు కూడా పెడతామని బెదిరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే తరహా సమాచారాన్ని అక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వాడుకున్నాయని.. వాళ్లకు తప్పు కానిది ఇక్కడ తప్పు ఎలా అయిందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం 50 దేశాలకు తరలిపోయిందని వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మిషన్ కాల్క్యాంపెయిన్ పేరుతో ఒక ప్రాజెక్టును కేటీఆరే ముందుండి నడిపించారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనికి సంబంధించి పలు స్ర్కీన్షాట్లు ఒక వీడియో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మిషన్ డాట్ కామ్‌లో మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన లబ్ధిదారుల డేటా అప్లోడ్ చేయడం జరిగిందని.. అందులో ఫోన్ నంబర్లు కూడా ఉంటాయని.. ఆ లబ్ధిదారులకు ఫోన్ చేసి టీఆర్‌ఎ్‌సకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని వివరిస్తున్న దృశ్యాలున్నాయి. ‘టీఆర్ఎస్ మిషన్ కాల్ క్యాంపెయిన్’ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆ యాప్‌కు సంబంధించిన పలు స్ర్కీన్ షాట్లు కూడా కనిపిస్తున్నాయి. ఒక స్ర్కీన్ షాట్లో.. ‘ఆసరా’ లబ్ధిదారు అయిన ఒక మహిళ పేరు, ఫోన్ నంబర్, నియోజకవర్గం, చిరునామా ఉండడం గమనార్హం.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ‘టీఆర్ఎస్మిషన్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించారు. వెబ్సైట్ కూడా ప్రస్తుతం పనిచేయ డం లేదు. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం కేసు బయటికి రావడంతో.. ముందస్తుగానే వాటిని తొలగించారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం బయట పెట్టిన విషయం గ్రహించి టీఆర్ఎస్ ఎదురు దాడి మొదలు పెట్టింది. అసలు ఈ యాప్ కు మా పార్టీకి సంబంధం లేదు అంటూ, స్టేట్మెంట్ లు ఇస్తున్నారు. అయితే తెలుగుదేశం మరిన్ని ఆధారలు విడుదల చేసింది, టీఆర్ఎస్ మిషన్ యాప్, కేసీఆర్ కుమార్తె, కవిత రిలీజ్ చేసిన ఫోటో, దానికి సంబంధించి అప్పుడు వచ్చిన పేపర్ కటింగ్స్ బయట పెట్టింది టిడిపి.. ఒక తప్పు చేసి, ఆ తప్పు కప్పిపుచ్చుకోవటానికి, కేటీఆర్ ఆడుతున్న వరుస డ్రామాలను, తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఎక్ష్పొజ్ చేస్తూ వస్తుంది. మరి ఈ ఫోటోల పై కేటీఆర్ , టీఆర్ఎస్ ఏమంటారో చూడాలి...