వేడి అందుకుంటోంది. వేగం పెరిగింది. రాజకీయ పక్షాలు అభ్యర్ధుల జాబితాను సిద్ధంచేస్తున్నాయి. అధినేతలు సైతం తమ సహజశైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్రలో ఒకరు అభ్యర్ధుల ఎంపికను దాదాపుగా పూర్తిచేస్తే, మరొకరు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల ఎంపికను చేపట్టారు. గెలుపుగుర్రాలుగా భావించేవారిని మాత్రమే రెండు పక్షాలు అభ్యర్ధులుగా ఎంచుకుంటున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ వస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా, వన్ టూ వన్ చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆయా నేతలకు భరోసా ఇస్తున్నారు. వారివారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు.
అయితే నిన్న కొంచెం భిన్నంగా చంద్రబాబు వ్యవహరించారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవటం కోసం, అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. రోజూ నిర్వహించే టెలి కాన్ఫరెన్స్‌లో భాగంగా బుధవారం ఉదయం చాట్రాయికి చెందిన టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మందపాటి బసవారెడ్డికి సీఎం ఫోన్‌చేసి పార్టీ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో బసవారెడ్డి మాట్లాడుతూ పింఛన్ల రెట్టింపు, పసుపు, కుంకుమ, అన్నదాత సుఖీభవ మొదలైన పథకాల అమలుతో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నాయకత్వంలో వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు.
చాట్రాయి మండలంలో పోతనపల్లి, బూరగ్గూడెం, పర్వ తాపురం గ్రామాలు ఒకప్పుడు కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైసీపీకి ఏకపక్షంగా ఉన్నాయని, ఈ గ్రామాల వల్ల మండలంలో టీడీపీకి మెజారిటీ రావడం లేదని, ఈసారి ఆ పరిస్థితి లేదని తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బసవారెడ్డి చాలా అర్థవంతంగా మాట్లా డారని కితాబునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల పార్టీకి మేలు జరగాలంటే స్థానిక నాయకత్వం సమర్థవంతంగా పనిచేసి, ఓటుబ్యాంకును గణనీయంగా పెంచాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని, అనేక కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉన్న వర్గాలను దగ్గర చేసుకోవాలని కోరారు.