ప్రతిసారీ ఓటు వేస్తున్నాం కదా... మా ఓట్లు ఇప్పుడు లేవేంటీ? అని సామాన్య ప్రజలే కాదు... ఏకంగా మంత్రి ఫరూక్ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన కుటుంబంలో ఏడుగురి ఓట్లు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. ఫరూక్ కు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడుకి నంద్యాలలోని 72వ పోలింగ్ కేంద్రంలో ఓట్లు న్నాయి. అయితే ఫరూక్ కుటుంబంలోని 7 ఓట్లు, ఫరూక్ అన్నదమ్ముల కుటుంబాల్లోని మరికొన్ని ఓట్లు గల్లంతైనట్లు వెలుగులోకి వచ్చింది. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు పథకం ప్రకారం ఓట్లను గల్లంతు చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో 54 లక్షల ఓట్లు తొలగించాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారానికి బీజేపీ నేతలే సలహాదారులని విమర్శించారు.
ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ ఆరోపణలకు పదును పెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ 24లక్షల ఓట్లు గల్లంతు చేయిస్తే, ఏపీలో సీఎం కుర్చీ ఎక్కడానికి వైసీపీ 52లక్షల ఓట్లను తొలగించడానికి స్కెచ్ వేస్తోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం విజయవాడలో, మైలవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్, బీజేపీతో కలిసి జగన్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఓట్ల తొలగింపునకు తన పార్టీయే స్వయంగా ఫామ్-7ను సమర్పించిందని జగనే ఒప్పుకున్నందున ఆయనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తున్న ప్రతిపక్ష నేత జగన్కు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అర్థమైందని, గెలిచే సత్తా లేకే బీజేపీ, టీఆర్ఎ్సలతో కలిసి కుట్రలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తునిలో ఆరోపించారు. నేరగాళ్లకు ఇలాంటి ఆలోచనలే వస్తాయన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించాలని చూస్తున్నాయని విమర్శించారు. వైసీపీ అధినేత వ్యవహార శైలి... దొంగే దొంగ అని అరిచినట్లుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గుంటూరులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నేర మనస్తత్వం ఫామ్-7 దాఖలుతో బహిర్గతమైందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కునే తొలగించేందుకు ప్రయత్నించిన జగన్.. అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను ఉండనిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు.