పశ్చిమగోదావరి జిల్లాలో కీలకమైన తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై ముఖ్య మంత్రి చంద్రబాబు దృష్టి సారించారు.అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, సమన్వయకర్త ఈలినాని, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆశిస్తున్నారు. ముగ్గురు నాయకులు కూడా తమ ఆకాంక్షను నేరుగా సీఎం చంద్రబాబు ముందుంచారు.రాష్ట్ర స్థాయి నాయకులతో సంప్రదింపులు జరుపు తున్నారు. సీఎంపై ఒత్తిడి పెంచుతున్నారు. చాపకింద నీరులా తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి, పార్టీ శ్రేణుల వరకూ ముళ్లపూడి, నాని, బొలిశెట్టి పేర్లతోనే అధిష్ఠానం ఆరా తీసింది.
ముగ్గురి అభ్యర్థిత్వాలపై సర్వే సాగింది. దీనిపై నియోజకవర్గంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరికి టిక్కెట్టు దక్కుతుందోనన్న ఆతృత పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇప్పటికే నర్సాపురం పార్లమెంట్ పరిధిలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. వారంతా ప్రచారాన్ని ప్రారంభించారు. తాడేపల్లిగూడెంపై సీఎం చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం రాష్ట్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ నుంచి అభిప్రాయాలను సేకరించారు.నిర్ణయాన్ని పెం డింగ్‌లో పెట్టారు. ముగ్గురు ఆశావహులు కూడా ఎవరికి వారే తమకే టిక్కెట్టు వస్తుందంటూ ధీమాతో ఉన్నారు.
ఈ మేరకు గురువారం రాజధానిలో ముళ్లపూడి, నాని, బొలిశెట్టిలతో ముఖ్య మంత్రి సమావేశం కానున్నారు. ముగ్గురు సర్దుబాటు ధోరణిలో పయనించాలంటూ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సామాజిక సమీకరణలు కీలక పాత్ర వహిస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్ర బాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ముగ్గురు నాయకులతో సంప్రదిం పులు జరిపిన తర్వాత ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.