రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫామ్-7 దరఖాస్తులను ఎన్నికల సంఘం జల్లెడపడుతోంది. ఓట్లను తొలగించాలంటూ చేసిన దరఖాస్తుల్లో 1.55 లక్షలు తప్పుడువని గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... వాటిని తిరస్కరించింది. రాష్ట్రవ్యాప్తంగా 8.76 లక్షల ఫామ్-7 దరఖాస్తులు వచ్చాయని, 45వేల సిబ్బందితో నిరంతరాయంగా వాటి పరిశీలన కొనసాగుతోందని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ క్రమంలో దురుద్దేశపూరితంగా దాఖలైనట్లు గుర్తించిన 1,55,696 దరఖాస్తులను తిరస్కరించినట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకూ 1,61,005 దరఖాస్తులను పరిశీలించగా... వాటిలో చనిపోయిన వారితోపాటు, బదిలీ అయిన ఓట్లకు సంబంధించిన 5309 దరఖాస్తులు మాత్రమే నిజమైనవని నిర్ధారణ అయిందన్నారు. ఇలా ఓట్ల దొంగల భాగోతం చూసి ఈసీ అవాక్కయింది.. 1,61,005 ఫిర్యాదులలో, కేవలం 5309 మాత్రమే నిజమైనవి తేలింది.
మరో నాలుగైదు రోజుల్లో అన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ ద్వారా గంపగుత్తగా వస్తున్న ఫామ్-7 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసిందన్నారు. అయితే, జనవరి 11న తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత ఒక్క ఓటు కూడా తొలగించలేదని ద్వివేది స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో ఫామ్-7 దాఖలు చేయగానే ఓట్లు తొలగించినట్లు కాదన్నారు. ఈ అంశాన్ని ప్రజలు, రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. నకిలీ దరఖాస్తులపై కేసులు నమోదు చేయడం ప్రారంభించిన తర్వాత ఫామ్-7 రాక తగ్గిపోయిందన్నారు. ఫామ్-7 దరఖాస్తు చేయొద్దు అనడం తమ ఉద్దేశం కాదని, దాఖలుకు నిజమైన కారణం ఉంటే దరఖాస్తు చేయొచ్చని చెప్పారు. ఫామ్-7 దరఖాస్తుల విషయంలో రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం కూడా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రకటనలు చేయొద్దన్నారు.
రాజకీయ పార్టీలు ఈసీకి ఒక మాట... మీడియాకు ఒక మాట చెప్పడం వల్ల ప్రజల్లో అపోహలు కలిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనల ప్రకారం తాము పని చేస్తామని, ఎలాంటి అనుమానాలకూ తావులేదని ద్వివేది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి చాలా తక్కువగా ఉందని, 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువ మందికి ఓటు హక్కులేనట్లుగా గుర్తించామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనేదే తన లక్ష్యమన్నారు. ఎవరి పేరు అయినా ఓటరు జాబితాలో లేకపోతే వెంటనే ఫామ్-6 దరఖాస్తు చేయాలని ద్వివేది సూచించారు. మంత్రి ఫరూక్ కుటుంబంలో ఏడుగురి ఓట్లు గల్లంతైన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా... తమ ఎన్నికల సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.