ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం సమీక్షా సమావేశానికి టీడీపీ అధిష్టానం సరికొత్త పంథాను అనుసరించింది. ఇప్పటివరకు జరిగిన సమీక్షలకు అతీతంగా అసెంబ్లీ నియోజకవర్గాలలోని క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. అదే సమయంలో ముఖ్యమైన నాయకులు ముందుగా మాగుంటతో భేటీ కాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ముందుగా మాగుంటతో భేటీ అయిన తర్వాతే సమీక్షా సమావేశానికి శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం వ్యవహారం అనంతరం తిరిగి రాత్రి 10గంటల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లతో ముఖాముఖి భేటి కార్యక్రమానికి సీఎం ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాగుంటతో మంత్రులు, పార్టీ నాయకులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం. ఒంగోలు లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా మాగుంట పేరుని ముందుగానే చంద్రబాబు ప్రకటించటం, ఆ తర్వాత ఆయన ఆయా నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితులపై ఆవేదన చెందుతూ సీఎంకి ఫిర్యాదులు చేయటం, అదే సమయంలో మాగుంట తమ పార్టీలోకి వస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రచారం చేయటం తెలిసిందే.

దీనికి తోడు టీడీపీలోనే ఉంటూ పోటీకి దూరంగా ఉండే ఆలోచన కూడా మాగుంట చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇంకోవైపు ఒంగోలు కాకుంటే నెల్లూరు నుంచైనా మాగుంటను బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల చంద్రబాబుని కలిసిన మాగుంట ముఖ్యమంత్రితో భేటీ వివరాలను వెల్లడించకపోగా తన రాజకీయ వైఖరిపై కూడా విస్పష్టమైన ప్రకటన చేయలేదు. పైగా మీడియాకు 28వ తేదీ తర్వాత అందుబాటులోకి వస్తానంటూ సంకేతమిచ్చారు. దీంతో మాగుంట పయనంపై తీవ్రమైన చర్చ ఆరంభమైంది. తెలుగుదేశం నేతలు పలువురు ఆయన వద్దకు చేరి టీడీపీ నుంచే పోటీ చేయండి, ఖచ్చితంగా గెలుస్తారంటూ భరోసా నివ్వటం ప్రారంభించారు.

ఆయన రాకకు అనుగుణంగా ఈ సమీక్షా సమావేశాన్ని కూడా రెండుసార్లు వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు సోమవారం సమావేశానికి మాగుంట హాజరుకావటంతో నాయకులు కొంతమేరకు ఊపిరిపీల్చుకున్నారు. ఆయన సూచనకు అనుగుణంగానే సమీక్షా సమావేశానికి శ్రీకారం పలికారు. అలాగే తొలుత ఇన్‌ఛార్జ్‌ మంత్రి నారాయణ , జిల్లామంత్రి శిద్దా, మరోమంత్రి పరిటాల, నిన్న మొన్నటి వరకు ఒంగోలు లోక్‌సభ పార్టీ పరిశీలకునిగా ఉన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజా, ప్రస్తుత పరిశీలకుడు దివి శివరాం భేటి అయ్యారు. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. తన అధికారిక పనులు పూర్తి చేసుకుని సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముందుగా మాగుంటతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఆ తర్వాతే ఆయన నియోజకవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, ఇతర నాయకులు, ఏరియా కో ఆర్డినేటర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహించి ప్రసంగించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read