వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రతి అభ్యర్థికి ప్రతిష్టాత్మకమని, అహం, భేషజాలు విడనాడి ప్రతి ఒక్కరూ ఓటర్లను ప్రభావితం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. టీడీపీ పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు 54 నియోజకవర్గాలకు చెందిన పరీశీలకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఓ నాయకుల కార్ఖానా.. నాయకత్వ సామర్థ్యాన్ని పెంచే రాజకీయ సంస్థ.. రాజకీయ నైపుణ్యాలను పెంచే కార్యశాల అని అభివర్ణించారు. చరిత్రలో భాగం కావడమా? చరిత్ర సృష్టించటమే అనేది ప్రధానమన్నారు. నిన్న అనేది ఓ చరిత్ర అని నేడు మనం చేసేది రేపటి చరిత్ర అన్నారు. ఈరోజు పార్టీ నాయకత్వం వల్లే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. ‘సేవ్ డెమోక్రసీ.. సేవ్ నేషన్’ టీడీపీ నినాదమన్నారు. 2019 ఎన్నికలు ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుడతాయన్నారు. ప్రజలను ప్రభావితం చేయటమే ఎన్నికల వ్యూహమన్నారు. అన్ని చోట్ల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని నిర్దేశించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తానూ ఓ అభ్యర్థినని భావిస్తేనే విజయావకాశాలు ఉంటాయన్నారు. రాజకీయాల్లో సామాజిక సమతుల్యత అత్యంత కీలకమన్నారు. ఎన్నికలు నాయకత్వ సామర్థ్యానికి రాజకీయ నైపుణ్యానికి ఓ పరీక్ష లాంటివన్నారు.

నాయకుల మధ్య విభేదాలు, అంతరాలు తొలగించుకుని ప్రజలతో మమేకం కావాలన్నారు. సమయం ఉందని స్తబ్దతు వహిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. సానుకూల ఫలితాల సాధనే అందరి ధ్యేయమన్నారు. టీడీపీ ఓ అద్భుత బృందమనే భావన అందరిలో కలగాలన్నారు. రాజకీయాల్లో పొరపాట్లకు స్థానం లేదని చెప్తూ ఏ చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పార్టీ కోసం అస్తులు అమ్ముకుని అన్నీ వదిలేసుకుని వచ్చిన వారి త్యాగాలే పునాదులన్నారు. ఎక్కడికక్కడ అన్ని స్థాయిల్లో వ్యవస్థల నిర్మాణం జరగాలన్నారు. తనతో సహా అంతా వ్యవస్థకు బద్ధులై ఉండాలన్నారు. నాకు కావాల్సింది అద్భుతమైన బృందం.. రాగద్వేషాలకు అతీతంగా నా నిర్ణయాలు ఉంటాయి.. ప్రతి ఎన్నిక మనందరికీ ఓ పాఠ్యాంశం.. నిరంతరం మనం నేర్చుకోవాల్సి ఉందని హితోపదేశం చేశారు. ఐదు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నదాత- సుఖీభవ, పసుపు- కుంకుమ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ముఖ్యమంత్రి యువనేస్తం, ఎన్టీఆర్ వైద్యసేవతో పేదవర్గాలను ఆదుకుంటున్నామని తెలిపారు.

రూ 30వేల కోట్లతో మూడు పథకాలు, పసుపు- కుంకుమ కింద రూ 10వేల కోట్లు, పింఛన్ల కింద 12వేల కోట్లు, అన్నదాత- సుఖీభవకు రూ 8వేల కోట్లు, 5లక్షల మందికి నిరుద్యోగ భృతి కింద రూ. 2వేల చొప్పున అందిస్తున్నామని, ఎన్టీఆర్ వైద్య సేవ ఖర్చులను రూ. 5లక్షలకు పెంచామని వీటన్నింటినీ ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమర్థులనే అభ్యర్థులుగా ఎంపిక చేస్తామని ప్రకటించారు. సామర్థ్యం, ప్రజాదరణ, గెలుపు అవకాశాలే ప్రామాణికమని చెప్తూ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 55వేల మంది సిద్ధంగా ఉన్నారని వివరించారు. నేటి అంచనాలే రేపటి వాస్తవికత అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు అదనంగా వస్తాయి? నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పెరుగుతాయనే అంశాలను పరిశీలన జరుపుతూ నియోజకవర్గం, గ్రామం, వార్డులలో వచ్చే ఓట్లను అంచనా వేయాలని నిర్దేశించారు. ప్రతి నాయకుడి పనితీరును బేరీజు వేస్తామని ప్రజాదరణను ఓట్లుగా మలచుకోవాలని సూచించారు. పనితీరును బట్టే భవిష్యత్‌లో గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు 200 మందిని ఎంపిక చేస్తామని, మరో 200 మందికి నియోజకవర్గాల్లో గుర్తింపులో భాగంగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, మార్కెట్ యార్డులలో పదవులలో ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read