పాక్ యుద్ధవిమానాలు నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చి బాంబులు జారవిడిచి వెళ్లాయి. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకొంది. పాక్ యుద్ధవిమానాల కదలికలపై ముందు నుంచే ఒక కన్నేసిన భారత వాయుసేన వెంటనే ప్రతిస్పందించింది. భారత్‌కు చెందిన యుద్ధవిమానాలు వాటిని అడ్డుకొనేందుకు వెళ్లాయి. భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు పాక్ ప్రకటించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌కు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ ఆసీఫ్ గఫూర్ వెల్లడించారు. పాక్ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ట్విటర్‌లో వెల్లడించారు.
వీటిలో ఒక విమానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూల్చేయగా.. మరో విమానాన్ని కశ్మీర్‌లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని భారత వాయుసేన ధ్రవీకరించాల్సి ఉంది. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ సైన్యానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీటైన జవాబిస్తోంది. పాక్ యుద్ధ విమానాలపై వైమానికి దళం ఎదురుదాడికి దిగింది. ఈ దాడుల్లో పాక్‌కు చెందిన ఎఫ్ - 16 యుద్ధ విమానం నేల కూలింది. లాంబ్ లోయలో నేలకూలినట్టు భారత వైమానిక దళం ధ్రువీకరించింది. అయితే కొంతమంది పైలట్లు ప్యారాచూట్ ద్వారా తప్పించుకున్నారని తెలుస్తోంది.
బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అటు పాక్ యుద్ధ విమానాలు.. ఇటు భారత వైమానిక దళం హోరాహోరిగా పోరాడుతున్నాయి. భారత్ భూభాగంలో పాక్ దాడుల నేపథ్యంలో.. పాక్ ఎలాంటి చర్యలకు పాల్పడినా తిప్పి కొట్టేందుకు సైన్యం సిద్ధమవుతోంది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, పఠాన్‌కోట్‌లో హై అలర్ట్ ప్రకటించింది. ఇక్కడి ఎయిర్ పోర్టులలో విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఎయిర్‌బేస్‌లో భారత వాయుసేనకు చెందిన విమానాలు, ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్‌ను కేంద్రం సిద్ధం చేసింది. యుద్ధానికి సర్వం సిద్ధమన్నట్టుగా సంకేతాలు ఇస్తోంది. మరోవైపు అమృత్‌సర్‌లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం ఎయిర్ పోర్టును మూసివేసినట్టు ఎయిర్ పోర్టు అధికారి ఏపీ ఆచార్య ఓ ప్రకటనలో తెలిపారు.