చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. సౌమ్యంగా, హుందాగా రాజకీయాలు నడపడం ద్వారా పాతతరం నేతలు ఈ నియోజకవర్గానికి గుర్తింపు తెచ్చారు. మరో దశలో చంద్రబాబు నాయకత్వంలో సాంప్రదాయ రాజకీయాన్ని తుడిచిపెట్టి చైతన్యంతో కూడిన కొత్తతరం రాజకీయం ఆవిష్కృతమైంది. అలాంటి చోట ఇపుడు జరుగుతున్న రాజకీయ విన్యాసాలు సామాన్య జనానికి వెగటు పుట్టిస్తున్నాయి. ఇక్కడ నుంచీ గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకునేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. క్రికెట్ పోటీలను నిర్వహించి, యువతకు క్రికెట్ కిట్లు, నగదు బహుమతులు ఇవ్వడం వరకూ సరే. వినాయక చవితికి అడిగినా అడగకపోయినా ప్రతి గ్రామానికీ వినాయకుని ప్రతిమలను అందించడమూ ఓకే.
పండుగలప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఇళ్ళకు తన కుటుంబసభ్యుల ద్వారా స్వీట్లు, బట్టలు పంపడమూ మంచి సాంప్రదాయమనే అనుకోవచ్చు. అయితే కొద్ది నెలల కిందట టీడీపీ ఇన్‌ఛార్జిగా పులివర్తి నానీ రంగప్రవేశం చేయడంతో పరిస్థితి మారింది. గ్రామస్థాయిలో టీడీపీ వర్గాన్ని పటిష్టం చేసుకునేందకు నానీ ప్రయత్నించడంతో వైసీపీ నుంచీ ప్రతిఘటన ఎదురవుతోంది. ఆ మేరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా తనదైన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. దీనికి తోడు జగన్ సలహాలు. దాంతో, ఎప్పటికప్పుడు పంధా మార్చుకుంటూ వస్తున్నారు. వైసీపీ నేతల ప్రయత్నాలు రానురానూ వివాదాస్పదమవుతున్నాయి. ప్రతి దాన్ని వివాదం చెయ్యటం, గొడవలు పెట్టటం, కొట్టటం, చివరకు అరెస్ట్ అవ్వటం, రెండు రోజులుకు ఒకసారి, ఇదే పని చేస్తున్నారు చెవిరెడ్డి.
ఉద్రిక్తతల సంగతి పక్కన పెడితే వీళ్ళు చేపడుతున్న ప్రలోభాల పర్వంతో జనం ఆత్మాభిమానం దెబ్బ తింటోంది. ఎన్నికల నేపధ్యంలో జనం మద్దతు పొందేందుకు బహిరంగంగా ప్రలోభాలకు గురి చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ సంబంధం లేకుండా, సందర్భం అసలే లేకుండా కొందరు తమ తలుపు తట్టి బహుమతులు ఇవ్వడం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని కొందరు అభ్యంతరంతో పాటు ఆగ్రహావేశాలూ వెలిబుచ్చుతున్నారు. ఇదిలా వుంటే ఇంత తరచుగా వైసీపీ నేతలు నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి ఇంటి తలుపూ తట్టి కానుకలు అందజేయడానికి అంత భారీగా నిధులు ఎక్కడ నుంచీ తెచ్చి ఖర్చు చేస్తున్నారనేది అంతుపట్టని ప్రశ్నగా మారుతోంది. మొన్నే కేసీఆర్ పంపించిన గడియారాలు కూడా పెద్ద వార్తా అయిన సంగతి తెలిసిందే.