చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రగిరిలో సర్వే వివాదంలో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పాకాలలో సర్వే చేస్తున్నవారిని అడ్డుకొని ట్యాబ్‌లు లాక్కొన్నవారిని అరెస్ట్ చేసి చిత్తూరు పీటీసీకి తరలించారు. అయితే అరెస్ట్ చేసినవారిని పీటీసీలో పెట్టే అధికారం లేదంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి సత్యవేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అయితే తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోలీసులు వేధిస్తున్నారంటూ స్టేషన్‌లోనే నిరసనకు దిగారు. సత్యవేడు పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కార్యకర్తలతో పాటు అక్కడకు పోటా పోటీగా టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఏ ఎస్పీ సుప్రజ ... అదనపు బలగాలను మోహరించారు.
అంతకు ముందు, నిన్న సాయంత్రం, సర్వే చేసేందుకు వచ్చిన వ్యక్తులపై దౌర్జన్యం చేసి అడ్డుకున్న వైకాపా నాయకులను పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆదివారం రాత్రి చిత్తూరులో ధర్నా చేపట్టారు. పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసు శిక్షణ కేంద్రం ఎదుట బైఠాయించారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని జయదేవ్ కాలనీకి కొందరు వ్యక్తులు ఆదివారం సర్వే కోసం వచ్చారు. వారిపై స్థానిక వైకాపా నాయకులు దౌర్జన్యం చేసి అడ్డుకున్నారు. వైకాపా నాయకులు దౌర్జన్యం చేసి ట్యాబులు లాక్కున్నారంటూ ఆ వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాలనీకి చెందిన నాయకులు నంగా నరేష్‌రెడ్డి, చెన్న కేశవరెడ్డి, ప్రకాష్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని చిత్తూరులోని పీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కరరెడ్డి రాత్రి 10.45 గంటలకు చిత్తూరుకు చేరుకుని అక్కడి పోలీసు శిక్షణ కేంద్రం ఎదుట బైఠాయించారు. తమ పార్టీ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిత్తూరు తెదేపా నాయకులు సైతం అక్కడికి చేరుకున్నారు. వైకాపా నాయకుల దౌర్జన్యం నశించాలంటూ వారు నినదించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి చెవిరెడ్డి ఓవర్ యాక్షన్ చెయ్యటంతో, అరెస్ట్ చేసి పోలీసులు లోపలేసారు.