తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధితో పనిచేస్తూ బీసీల ఆశాజ్యోతిగా పేరు తెచ్చుకున్న మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీని వీడి వైసీపీలోకి వెళుతున్నారని చేస్తున్న ప్రచారాన్ని బీసీలు చూస్తూ సహించరని పెనుగొండ ఏఎంసీ చైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ హెచ్చరించారు. పెనుగొండ టీడీపీ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గస్థాయి నాయకులు హాజరై అసత్య ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా సాన బోయిన గోపాలకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో పితాని చేస్తున్న పాదయాత్రలో ప్రతీ గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరుతున్నారని, కావాలనే కొందరు దుష్పచారం చేస్తూ బలహీనవర్గాల ఆశాజ్యోతి అయిన పితానిని ఈ విధంగా కించపరచడం తగదని అన్నారు.
ఆచంట ఏఎంసీ చైర్మన్ ఉప్పలపాటి సురేష్‌బాబు మాట్లాడుతూ కేడరును ప్రజలను అయోమయంలోకి నెట్టేందుకు ఓ ఛానల్ ఈ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ నేతలు ఆచంట నియోజకవర్గంలో అయిదారు వేల ఓట్లు తీయించేందుకు ఫారం 7 ద్వారా కుట్ర పన్నారని, ఇప్పుడు పితాని పార్టీ మారుతున్నారని ప్రచారానికి దిగారన్నారు. మీడియా ఆలోచించి నిజాలను ప్రచారం చేయాలన్నారు. ఆచంట నియోజకవర్గంలో పితాని ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. పితాని సత్యనారాయణ టీడీపీలోనే ఉంటారని అయిదు కోట్ల రూపాయలు పందెం కాయడానికి ఆయన తనయుడు వెంకట్ సిద్ధంగా ఉన్నారని టీడీపీ పెనుగొండ మండల అధ్యక్షుడు వెలిచేటి బాబూరాజేంద్రప్రసాద్ అన్నారు. వైసీపీ నుంచి పితాని రాజమండ్రి ఎంపీ స్థానానికి, ఆచంట శాసనసభకు పితాని తనయుడు వెంకట్ పోటీ చేస్తారని ఓ చానల్ ప్రచారం చేసిన దాంట్లో నిజం లేదన్నారు. ఆచంట స్థానంలో గెలిచే సత్తాలేకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అసత్య ప్రచారం సాగిస్తుందన్నారు.
కేడర్‌కు చెప్పకుండా పితాని ఏ నిర్ణయం తీసుకోరని, రాష్ట్రంలో ఏ మంత్రి గాని, ఎమ్మెల్యే గాని ఇప్పటికే పితాని చేసినంతగా ఎన్నికల ప్రచారం చేయలేదని అన్నారు. పెనుమంట్ర టీడీపీ మండల అధ్యక్షుడు తమనంపూడి శ్రీనివాసరెడ్డి(బుల్లా) మాట్లాడుతూ పితానిని గెలవలేక ప్రజలను అయోమయంలోకి నెట్టి లబ్ధి పొందేందుకు ఆచంట వైసీపీ కన్వీనరు రంగనాథరాజు మైండ్ గేమ్ అడుతున్నారని విమర్శించారు. ఆచంట సీటు పితానికి ఇవ్వొద్దన్న రఘురామకృష్ణంరాజు మాటను సీఎం విననందునే ఆయన టీడీపీని వీడారన్నారు. సీటు ఖరారై ప్రచారం సాగిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రచారం తగదని హితవు పలికారు. దళిత నాయకుడు బీరా నర్శింహమూర్తి మాట్లాడుతూ దళితులంతా పితాని వెంటే ఉంటారన్నారు. సమావేశంలో జడ్పీటీసీలు రొంగల రవికుమార్, సత్తి సాయి ఆదినారాయణరెడ్డి, బొక్కా నాగేశ్వరరావు, సిద్ధాంతం పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ కేతా సత్యనారాయణ, తేతలి రాజారెడ్డి, బీవీ రత్తయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు కటికిరెడ్డి నానాజీ, కార్యదర్శి వేండ్ర రాము, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కుక్కల రామకృష్ణ తదితురులు పాల్గొన్నారు.