పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ పి.సునీల్‌ కుమార్‌కు మంగళవారం హైదరాబాదులో జగన్‌ నివాసం వద్ద జరిగిన అవమానం పట్ల జిల్లావ్యాప్తంగా దళిత వర్గాలు భగ్గుమంటున్నాయి. టికెట్‌ ఇవ్వకపోతే పోయారు... అంతగా అవమానించాలా? అంటూ మండిపడుతున్నాయి. అదే సొంత సామాజికవర్గానికి చెందిన మరో సిట్టింగ్‌కు టికెట్‌ ఇవ్వకపోయినా ఫ్యామిలీతో గ్రూపు ఫొటో కూడా దిగి బుజ్జగించి పంపించడం వివక్ష కాక మరేమిటి అంటూ ధ్వజమెత్తుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచీ ఎస్సీ సామాజిక వర్గంతో పాటు సామాన్య దళితుల్లోనూ, సామాజిక స్పృహ కలిగిన వారినీ తీవ్రంగా మధనపెడుతోందీ వ్యవహారం. పూతలపట్టు నుంచీ గత ఎన్నికల్లో డాక్టర్‌ పి.సునీల్‌కుమార్‌రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన నివాసం పలమనేరులో. అక్కడ వైద్యవృత్తి కొనసాగిస్తున్నారు. గత ఎన్నికలప్పుడే నియోజకవర్గంలో వైసీపీకి చెందిన మెజారిటీ నేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అయినా అధిష్ఠానం టికెట్‌ ఇచ్చింది. ఆయన గెలిచారు. తర్వాత కూడా పార్టీ నేతలు ఆయనకు పెద్దగా సహకరించింది లేదు. కొంతకాలం చూశాక ఇక నేతల తీరు మారదని గ్రహించిన సునీల్‌ తన పాటికి తాను నియోజకవర్గంలో ఒంటరిగా పర్యటించడం మొదలుపెట్టారు. ఐరాల, యాదమరి, బంగారుపాళ్యం వంటి టీడీపీ నేతలు దూకుడుగా వుంటే మండలాల్లో కూడా ఒంటరి పోరాటం చేశారు. మండల పరిషత్‌ సమావేశాల్లో సమస్యలపై గట్టిగా వాదించడం, టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడిచేస్తే ప్రతిఘటించడం చేశారు. పలు సందర్భాల్లో రాస్తారోకోలు, ధర్నాలతోనూ అధికార వర్గాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇక జడ్పీ సమావేశాల్లో కూడా ప్రజా సమస్యలపై మంత్రిని, అధికారులను గట్టిగా నిలదీశారు. వ్యక్తిగతంగా సౌమ్యుడని, మంచివాడని, వివాద రహితుడని ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో ఆయన్ను ప్రశంసిస్తుంటారు.

అవన్నీ పక్కన పెడితే జిల్లాలో వైసీపీనే కాదు టీడీపీ అధిష్ఠానం కూడా రిజర్వుడు సీట్లలో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏనాడూ దళిత ఎమ్మెల్యేలు, అభ్యర్థుల పట్ల అవమానకరంగా వ్యవహరించింది లేదు. రెండు నెలలుగా జీడీనెల్లూరు, పూతలపట్టు ఇన్‌ఛార్జులను, సత్యవేడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేను అనేకసార్లు పిలిపించి చర్చించారు. టికెట్‌ ఇచ్చినా ఇవ్వకున్నా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానించలేదు. వైసీపీ అధినేత జగన్‌ కూడా ఇతర వర్గాల ఎమ్మెల్యేల పట్ల అలా వ్యవహరించిన దాఖలాలు లేవు. ఉదాహరణకు మదనపల్లె సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డికి కూడా ఆయన ఈసారి టికెట్‌ ఇవ్వలేదు. ఆయనకు బదులు ముస్లిం మైనారిటీ అభ్యర్థి నవాజ్‌ను ఎంపిక చేశారు. తిప్పారెడ్డిని, ఆయన కుటుంబసభ్యులనూ పిలిపించి వారిని బుజ్జగించి పంపించారు. వారితో గ్రూపు ఫొటో కూడా దిగారు. అదే పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ విషయానికొచ్చేసరికి ఆ పార్టీ అధినేత మంగళవారం వ్యవహరించిన తీరు జిల్లాలో దుమారం రేపుతోంది. ముఖ్యంగా దళిత వర్గాలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. సాంప్రదాయకంగా మెజారిటీ దళిత వర్గాలు తొలి నుంచీ కాంగ్రెస్‌కు తర్వాత వైసీపీకి మద్దతిస్తున్నాయి.

అయినా కూడా వైసీపీ అధిష్ఠానం లోటస్‌ పాండ్‌ ఆవరణలో దిక్కులేని వ్యక్తిలా ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పడిగాపులు పడే స్థితికి తెచ్చి పెట్టడాన్ని దళితవర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేత ఒకరు ఆ సమయంలో వుండి కూడా కనీసం మొహమాటానికి కూడా పలకరించకుండా ముఖం తిప్పుకుని లోటస్‌పాండ్‌లోకి వెళ్ళిపోవడాన్ని ఆ వర్గాలు భరించలేకపోతున్నాయి.టికెట్‌ ఇవ్వడం ఇవ్వకపోవడమనేది వేరే అంశమని, అది పూర్తిగా ఆయా పార్టీల అధిష్ఠానాల హక్కని, దాన్ని తాము ప్రశ్నించడం లేదని అంటున్నాయి. అయితే సునీల్‌కుమార్‌ను అంతగా అవమానించాల్సిన అవసరమేమిటన్నది వారి ప్రశ్న. గతంలోనూ వైసీపీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధి ఒకరు ధర్నా చేస్తుండగా అక్కడి పోలీసు అధికారి దూరం నుంచీ మాట్లాడారు. దీనికి ఆమె తానేం ఎస్సీని కాదని, దగ్గరగా వచ్చి మాట్లాడవచ్చునని వ్యాఖ్యానించడం కూడా దుమారం రేపింది. దళిత సంఘాల నేతలు ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు దళిత సంఘాలు వైసీపీ అధిష్ఠానం తీరును ఖండించాయి. భారతీయ అంబేద్కర్‌ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్‌ సహా మదనపల్లె, వి.కోట, కుప్పం, బి.కొత్తకోట, పీలేరు తదితర ప్రాంతాలకు చెందిన ఎస్సీ సంఘాలు ఖండిస్తూ ప్రకటనలు జారీ చేశాయి. మొత్తంమీద సరిగ్గా ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ పట్ల వైసీపీ అఽధిష్ఠానం వ్యవహరించిన తీరుతో ఆ పార్టీ జిల్లాలో రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read