విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల సెంటర్ లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ లోటస్ పాండ్ లోనే ఉంటే మంచిదని అన్నారు. కేసీఆర్, మోదీల చేతిలో జగన్ కీలుబొమ్మ అని, కేసులకు భయపడి ఎప్పుడో లొంగిపోయాడని వ్యాఖ్యానించారు. తన జీవితంలో హింసలేదని, ఎవరైనా రౌడీయిజం చేస్తే అణచివేస్తామని హెచ్చరించారు. జగన్ కు ఏమైనా పరిపాలన తెలుసా అని ప్రశ్నించారు. "జగన్ కు ఏమైనా అనుభవం ఉందా? ప్రతిరోజూ అడుగుతుంటాడు, ఒక్క అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని. ఏంటిది తమ్ముళ్లూ! ప్లీజ్ కేమైనా విలువ ఉందా! ఇదేమన్నా చాక్లెట్టా పోతే పోయిందిలే అనుకుని ఇవ్వడానికి. వంద రూపాయలా అడగ్గానే ఇచ్చేయడానికి. ప్లీజ్ అనగనే కనికరిస్తే మరణవాంగ్మూలాన్ని రాసుకున్నట్టే. మన పిల్లల భవిష్యత్తును పాడుచేసుకుంటామా? ఏదోలే పాపం అని కొందరు అనుకుంటారు, కానీ ఒక్క అవకాశం ఇస్తే బీహార్ అయిపోతుంది" అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
ఇక, కేసీఆర్ పైనా చంద్రబాబు నిప్పులు చెరిగారు. రేపటి ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి మన శక్తేంటో చాటిచెప్పాలని, అప్పుడే టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు అర్థమవుతుందని అన్నారు. మా ప్రజలు అనుకుంటే మిమ్మల్ని చుట్టుముట్టి ఊడ్చిపారేస్తారు తప్ప వదిలిపెట్టరని నిరూపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోనే సెంటిమెంట్ ఉందని కేసీఆర్ భావిస్తున్నాడని, కానీ, 60 ఏళ్ల కష్టాన్ని వదులుకున్న ఏపీ ప్రజలకు ఎంత సెంటిమెంట్ ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ‘మన ఆస్తులు దోచుకుని, మనపై దాడి చేస్తున్న కేసీఆర్‌తో జగన్ చేతులు కలిపారు. నాకు రిటర్న్ గిఫ్టు ఇస్తానన్న కేసీఆర్... నన్ను ఓడించడానికి జగన్‌కు వెయ్యి కోట్ల గిఫ్టు ఇచ్చారు. కేసీఆర్ రక్షణలో ఉన్న జగన్ రేపు సీఎం అయితే కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అమ్మేస్తారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పింఛన్ పదిరెట్లు పెంచి రూ.2వేలు అందిస్తున్నాను. పెద్దన్నగా బాధ్యత తీసుకుని మహిళలకు రెండుసార్లు పసుపు కుంకుమ సాయం అందించాను. రైతులకు రూ.24,500 కోట్లు రుణమాఫీ చేశాను. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం రైతుకు రూ.6వేలు ఇస్తే... రాష్ట్రం తరపున మరో రూ.9వేలు ఇస్తున్నాను. పెద్ద రైతులకు కూడా రూ.10వేల సాయం, కౌలురైతులకు సాయం అందించేలా చర్యలు చేపడుతున్నాం’’ అని చంద్రబాబు అన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.2వేలు అందిస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ నిరుద్యోగ భృతి అందించడం లేదన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.82వేల నుంచి లక్షా 65వేల రూపాయలకు పెంచామని గుర్తు చేశారు. దీనిని భవిష్యత్తులో రూ.3.50లక్షలకు పెంచుతాను. రాష్ట్ర ప్రజలను కడుపులో పెట్టి కాపాడుకుంటాను అని ముఖ్యమంత్రి భరోసా కల్పించారు.