వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన ఆరోపణలు చేశారు. విజయనగరం జిల్లా సాలూరు రోడ్‌షో లోపాల్గొన్న చంద్రబాబునాయుడు జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బాబాయ్‌ని ఇంత దారుణంగా చంపేసి, ఎవరో చంపేసినట్టు నాటకాలు ఆడుతున్నారు. ‘ముందు నాటకం, తర్వాత నేనే (చంద్రబాబు) చంపానని బూటకం. ఆ తర్వాత డ్రైవర్‌ను రమ్మంటే చంపేశాడని లెటర్ రాశారట. దీన్ని ఎవరైనా నమ్ముతారా? నేను చీఫ్ క్రిమినల్ అంట. ఎప్పుడైనా నా జీవితంలో ఒక్క కేసైనా ఉందా? వారి జీవితంలో ఎప్పుడూ కేసులే. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే మీకు రక్షణ ఉంటుందా? ఆడబిడ్డలు బయటకు వస్తే ఇంటికి రాగలరా? వీధికి ఒక రౌడీ తయారవుతాడు.’ అని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. తనను చూస్తే పరిశ్రమలు వస్తాయని.. జగన్ మోహన్ రెడ్డిని చూస్తే పరిశ్రమలు పారిపోతాయన్నారు. ఆయన గతంలో పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్‌లను జైలుకు తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. విజయనగరం జిల్లా సాలూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీలో యువత కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తుతుంటే వైసీపీలో యువతకు సారా పోయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయ్. జగన్‌ను చూస్తే పరిశ్రమలు పారిపోతాయి. జగన్ జైలుకు తీసుకుపోతారని అందరకీ భయం. నన్ను చూస్తే అనుమతులు సులభంగా వస్తాయని, పెట్టుబడులు పెడితే ఇబ్బందులు ఉండవని, వాటాలు అడగబోమని అందరూ నా దగ్గరికి వస్తారు. జగన్ మాత్రం వాటాలు తీసుకోవడమే కాదు... జైలుకు తీసుకెళ్తారు. ఇంతకు ముందు చాలా మందిని జైలుకు తీసుకెళ్లారు. వైసీపీకి సహకరిస్తే మీకు తెలియకుండా మిమ్మల్ని నేరాల్లో ఇరికించి జైల్లో పెట్టిస్తారు. జాగ్రత్త. అది పనికిమాలిన పార్టీ. నేరాల చిట్టా.’ అని చంద్రబాబునాయుడు అన్నారు.
కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో రూ.1000 కోట్లు జగన్ మోహన్ రెడ్డికి పంపించారని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులను కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఆస్తులు ఉన్న లీడర్లను కేసీఆర్ భయపెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఐటీ దాడులతో మోదీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఓటుకు రూ.5వేలు ఇచ్చి కొనేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారని అన్నారు. ఒక్కసారి వైసీపీకి అవకాశం ఇస్తే మొత్తం దోచేసుకుంటారని చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రం శాశ్వతంగా అంథకారం అయిపోతుందన్నారు.